- ఖురాన్ సాక్షిగా ప్రమాణం.. ఓల్డ్ సబ్వే స్టేషన్‌లో కార్యక్రమం
న్యూయార్క్: భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ అమెరికాలోని న్యూయార్క్ సిటీ మొదటి ముస్లిం మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. సిటీలోని మాన్‌హట్టన్ ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న పురాతన సబ్వే స్టేషన్లలో ఒకటైన పాత సిటీ హాల్ స్టేషన్‌లో ఆయన గురువారం అర్ధరాత్రి న్యూయార్క్ సిటీ 112వ మేయర్‌గా ప్రమాణం చేశారు.
ఆ సమయంలో ఆయన భార్య రమా దువాజీ ఖురాన్‌ను పట్టుకుని పక్కన ఉన్నారు. డెమోక్రాట్ పార్టీకి చెందిన 34 ఏండ్ల జోహ్రాన్ మమ్దానీతో ఆయన రాజకీయ స్నేహితురాలైన న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జోహ్రాన్ మమ్దానీ మాట్లాడుతూ.. ఇది తనకు లభించిన గొప్ప గౌరవం, అదృష్టమని పేర్కొన్నారు. అనంతరం మధ్యాహ్నం ఆయన మరోసారి మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు సిటీ హాల్‌లో నిర్వహించిన బహిరంగ కార్యక్రమంలో యూఎస్ సెనేటర్ బెర్నీ సాండర్స్.. జోహ్రాన్ మమ్దానీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం న్యూయార్క్ సిటీ హాల్ సమీపంలోని బ్రాడ్‌వే రోడ్డులోని "క్యానన్ ఆఫ్ హీరోస్" (టికర్-టేప్ పరేడ్‌లకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం)లో బ్లాక్ పార్టీ జరిగింది.
భారత సంతతికి చెందిన మమ్దానీ.. ప్రముఖ సినీ నిర్మాత మీరా నాయర్, కొలంబియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మహమూద్ మమ్దానీ కుమారుడు. అతను ఉగాండాలోని కంపాలాలో పుట్టి పెరిగాడు. 7 సంవత్సరాల వయస్సులో తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ నగరానికి వచ్చాడు. మమ్దానీ 2018లో అమెరికా పౌరసత్వం పొందారు. ఆ తర్వాత ఆయన న్యూయార్క్‌సిటీలో డెమొక్రాటిక్ అభ్యర్థుల కోసం రాజకీయ ప్రచారాలు పాల్గొన్నారు.
