రాబోయే 25 ఏండ్లు దేశానికి ఎంతో కీలకం

రాబోయే 25 ఏండ్లు దేశానికి ఎంతో కీలకం

హైదరాబాద్/గచ్చిబౌలి,  వెలుగు: మన దేశం సూపర్ పవర్ , నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీగా మారడానికి ఇన్నొవేషన్లు, ఎంట్రప్రెన్యూర్ షిప్‌లు కీలకమని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. శనివారం హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీలో 22వ స్నాతకోత్సవం జరిగింది. గచ్చిబౌలిలోని బ్రహ్మ కుమారీస్​ గ్లోబల్ ​పీస్​ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ వేడుకలకు కేంద్ర మంత్రితో కలిసి గవర్నర్​ తమిళిసై హాజరయ్యారు. కరోనా కారణంగా మూడేండ్ల తర్వాత జరిగిన ఈ స్నాతకోత్సవంలో స్టూడెంట్లకు డిగ్రీ పట్టాలు, బంగారు పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్​ మాట్లాడుతూ రాబోయే 25 ఏండ్లు దేశానికి ఎంతో కీలకమన్నారు.  డిగ్రీలు పొందిన స్టూడెంట్లు తమ స్కిల్స్​ను సొసైటీకి తిరిగి ఇచ్చేలా కృషి చేయాలని సూచించారు. నేడు ప్రపంచ దేశాలు భారత్​ వైపు చూస్తున్నాయని, 100వ స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకునే సమయానికి ప్రపంచానికి మన దేశం దిక్సూచిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నేషనల్ ఎడ్యుకేషన్​ పాలసీ విద్యార్థులను మాతృభాషలో నిపుణులుగా మారుస్తుందని, ఈ పాలసీ ద్వారా స్టూడెంట్లు గ్లోబల్​ లీడర్లుగా ఎదుగుతారని తమిళిసై అన్నారు.  హైదరాబాద్​ సెంట్రల్​వర్సిటీ దేశంలోని అత్యుత్తమ వర్సిటీల్లో ఒకటిగా గుర్తింపు పొందిందన్నారు. 

సీబీసీ, ఆస్కిల మధ్య ఎంవోయూ

కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ( సీబీసీ) , అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ( ఆస్కీ )ల మధ్య కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో ఎంవోయూ కుదిరింది. శనివారం సోమాజిగూడలోని ఆస్కీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ శాఖల అధికారుల్లో స్కిల్స్ పెంచడానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీబీసీ, ఆస్కీలు ట్రైనింగ్ కార్యక్రమాలను చేపట్టనున్నాయి. ఏటా వివిధ పోగ్రామ్​ల ద్వారా 5 వేల మంది స్టూడెంట్స్ డిగ్రీలు పొందుతున్నారని కేంద్ర మంత్రికి ఆస్కీ డీజీ పద్మనాభయ్య తెలిపారు.

నిత్య విద్యార్థిగా నేనెంతో నేర్చుకున్న

రోజూ ఓ విద్యార్థిలా నేర్చుకుంటూ ఉంటేనే  ఉన్నత శిఖరాలను చేరుకోగలమని గవర్నర్​ తమిళిసై అన్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్​బీ) లో శనివారం నిర్వహించిన పీజీపీ మ్యాక్స్ లీడర్ షిప్ సమ్మిట్–2022కు ఆమె ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ కరెన్సీ లెక్కించడం కాకుండా క్యాలరీలను కూడా లెక్కించుకోవాలన్నారు. వ్యాపారవెత్తలు చిన్న విషయాలనూ పరిశీలించాలని, తోటి ఉద్యోగులు, కింద పనిచేసే వారితో స్నేహంగా ఉండాలన్నారు. తాను తెలంగాణ గవర్నర్​గా బాధ్యతలు చేపట్టే సమయంలో ఎన్నో విమర్శలు వచ్చాయని, కొత్త రాష్ట్రానికి పాలనా అనుభవంలేని తనను గవర్నర్​గా నియమించడంపై పెదవి విరిచారని గుర్తుచేశారు. కానీ తాను నిత్య విద్యార్థిగా ఎంతో నేర్చుకున్నానని చెప్పారు.