రాబోయే మూడు తరాలకు అన్యాయం చేశారు

రాబోయే మూడు తరాలకు అన్యాయం చేశారు

నర్సాపూర్, వెలుగు: సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రాబోయే మూడు తరాలకు అన్యాయం చేశారని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ఆరోపించారు. మహిళలకు రూ.300 విలువ చేసే బతుకమ్మ చీర పంచి ఆ నష్టాన్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎనిమిదేండ్ల పాలనలో కేసీఆర్ మహిళలకు ఇచ్చిన ఒక్కహామీ అయినా నెరవేర్చారా అని ప్రశ్నించారు. ప్రజా ప్రస్థాన పాదయాత్రలో భాగంగా బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్​లో జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. ధరలు పెరగడంతో రాష్ట్రంలో సామాన్యులు నిత్యావసర సరుకులు కొనే పరిస్థితులు లేకుండా పోయిందన్నారు. మహిళలపై దాడులు, అక్రమ రవాణా, అత్యాచారాలు, మర్డర్లలో తెలంగాణ.. సౌత్​ఇండియాలోనే టాప్​లో ఉందన్నారు. వీటిని కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ బతుకమ్మ చీరలు పంచుతున్నారని ఆరోపించారు.  

రాష్ట్రంలో తిన్నది చాలక దేశం మీద పడ్డరు.. 

మన రాష్ట్రాన్ని నాశనం పట్టించింది చాలదన్నట్టు సీఎం కేసీఅర్ దేశం మీద పడ్డారని షర్మిల మండిపడ్డారు. తెలంగాణాలో కేసీఆర్ మోసం చేయని వర్గం లేదని ఆరోపించారు. నర్సాపూర్​ నియోజకవర్గానికి ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. వైఎస్సార్ హయాంలోనే డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేశారని, 5 మండలాలకు 5 జూనియర్​ కాలేజీలు మంజూరు చేశారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మదన్​ రెడ్డి ఏమైనా పనికి వచ్చారా, ఆయన వల్ల నియోజకవర్గంలో ఒక్కరికైనా ఉపయోగం ఉందా అని షర్మిల ప్రశ్నించారు. ఆయన చేసేవన్నీ భూ కబ్జాలు, ఇసుక మాఫియా పనులేనని ఆరోపించారు.