
- ప్రాజెక్టు పనుల వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లిందన్న ట్రిబ్యునల్
- రూ.447 కోట్లతో వనరులను పెంచాలని ఆదేశం
- ఈఎంపీ కోసం ఇంకో రూ.3,240.97 కోట్లు ఖర్చు చేయాలని ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో తెలంగాణ సర్కారు పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడటంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అక్షింతలు వేసింది. ప్రాజెక్టు పనుల కారణంగా దెబ్బతిన్న పర్యావరణ పునరుద్ధరణ కోసం రూ.447 కోట్లు, ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్ ప్లాన్ (ఈఎంపీ) కోసం ఇంకో రూ.3,240.97 కోట్లు ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో పర్యావరణ ఉల్లంఘనలపై సిద్దిపేట జిల్లాకు చెందిన మహ్మద్ హయతుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ షియో కుమార్ సింగ్, జ్యుడీషియల్ మెంబర్ జస్టిస్ అరుణ్ కుమార్ త్యాగి, ఎక్స్‌పర్ట్ మెంబర్ సెంథిల్ వేల్‌తో కూడిన ఎన్జీటీ ప్రిన్సిపల్ బెంచ్ (ఢిల్లీ) విచారించి.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాజెక్టుతో పర్యావరణంపై పడే ప్రభావ నివేదికను సమర్పించడానికి కేంద్ర పర్యావరణ శాఖ కోరినట్టుగా మూడు నెలల గడువు ఇచ్చింది. పర్యావరణ తుది అనుమతులు సాధించే వరకు ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టవద్దని తేల్చిచెప్పింది.
పర్యావరణానికి నష్టం
కాళేశ్వరం నిర్మాణ పనుల కారణంగా పర్యావరణానికి నష్టం వాటిల్లిందని ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘పర్యావరణ పునరుద్ధరణ, సహజ వనరులను పెంపొందించడానికి రూ.447 కోట్లు ఖర్చు చేయాలి. భూమి, గాలి, నీరు, శబ్ద, జీవ సంబంధిత పర్యావరణ పరిరక్షణ చర్యలు, సహజ వనరుల పునరుద్ధరణ చేపట్టాలి. కమ్యూనిటీ రిసోర్సెస్ డెవలప్‌మెంట్‌లో భాగంగా స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్, రోడ్లు, కమ్యూనిటీ సెంటర్ల పునరుద్ధరణ, బస్ షెల్టర్ల నిర్మాణం, స్కూళ్లు, కాలేజీల అప్గ్రెడేషన్, వాటిలో సదుపాయాల కల్పన, పీహెచ్‌సీలు, హాస్పిటళ్లు, సోలార్ వీధి లైట్ల ఏర్పాటు తదితర పనులు చేపట్టాలని ఆదేశించింది.
ఈ మొత్తాన్ని మూడేండ్లలోపు ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌లో భాగంగా క్యాచ్‌మెంట్ ఏరియా పునరుద్ధరణ, కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్, ప్రత్యామ్నాయ అడవుల పెంపకం, బయోడైవర్సిటీ, వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్, గ్రీన్ బెల్ట్ డెవలప్‌మెంట్, ఫిషరీస్, రిజర్వాయర్ మేనేజ్‌మెంట్, చెత్త–వ్యర్థాల నిర్వహణ, ప్రజారోగ్యం, లోకల్ఏరియా డెవలప్‌మెంట్‌తోపాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి కలిపి రూ.3,240.97 కోట్లు ఖర్చు చేయాలని ఆదేశించింది.
ఈ మొత్తాన్ని ఐదేండ్లలో ఖర్చు చేయాలని పేర్కొంది. పర్యావరణ శాఖ తుది నివేదిక ఇచ్చినతర్వాత ఈ మొత్తాన్ని ఎవరి వద్ద డిపాజిట్చేయాలి? ఎలా ఖర్చు చేయాలి? అనేద దానిపై ఎన్జీటీ ఆదేశాలు ఇవ్వనుంది.