తెలంగాణ సర్కార్​కు ఎన్జీటీ భారీ జరిమానా

తెలంగాణ సర్కార్​కు ఎన్జీటీ భారీ జరిమానా

వ్యర్థాల నిర్వహణలో గైడ్ లైన్స్ పాటించకపోవడం, కోర్టు తీర్పులను అమలు చేయకపోవడంపై తెలంగాణ సర్కార్​కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) భారీ జరిమానా విధించింది. రూ.3,800 కోట్లు ప్రత్యేక అకౌంట్లో జమ చేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్​ను ఆదేశించింది. వ్యర్థాల నిర్వహణకు తీసుకున్న చర్యలు, పురోగతిని ఎప్పటికప్పుడు తెలియజేయాలంది. పర్యావరణ సురక్షా స్వచ్ఛంద సంస్థ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఎన్జీటీ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) భారీ జరిమానా విధించింది. వ్యర్థాల నిర్వహణలో మార్గదర్శకాలు పాటించకపోవడం, కోర్టు తీర్పులను అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్జీటీ, రూ.3,800 కోట్ల ఫైన్​ వేసింది. ఆ మొత్తాన్ని ప్రత్యేక అకౌంట్లో జమ చేయాలని సీఎస్ సోమేశ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ను ఆదేశించింది. వ్యర్థాల నిర్వహణకు చర్యలు చేపట్టాలని, తీసుకున్న చర్యలు, సాధించిన పురోగతిని తమకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించింది. పర్యావరణ సురక్షా స్వచ్ఛంద సంస్థ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఎన్జీటీ, ఈ మేరకు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 1996లో మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య, వ్యర్థాల నిర్వహణ సరిగా లేదని దాఖలైన పిటిషన్స్​ను సుప్రీంకోర్టు 2014లో ఎన్జీటీకి బదిలీ చేసింది. 351 నదీ పరీవాహక ప్రాంతాలు, 124 నగరాల్లో గాలి కాలుష్య నివారణపై మరో పిటిషన్ దాఖలైంది. 100 కాలుష్య కారక పారిశ్రామిక ప్రాంతాలపై చర్యలు తీసుకోవాలని, అక్రమ ఇసుక, మైనింగ్​పై చర్యలు తీసుకోవాలని స్వచ్ఛంద సంస్థ పిటిషన్ వేసింది. కాగా రెండు అంశాలను మాత్రమే ఎన్జీటీ ప్రస్తుతం విచారణకు స్వీకరించింది. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్.. సుప్రీం ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది. ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల నుంచి వివరణ కోరింది. తెలంగాణ సీఎస్​ను విచారించిన ట్రిబ్యునల్, సీఎస్ ఇచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే భారీ జరిమానా విధిస్తూ ఈ నెల1న ఉత్తర్వులు జారీ చేసింది.