మానేరులో ఇసుక రీచ్ ల మూసివేతకు ఎన్టీజీ ఆదేశం

మానేరులో ఇసుక రీచ్ ల మూసివేతకు ఎన్టీజీ ఆదేశం

కరీంనగర్, వెలుగు: ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా కరీంనగర్ జిల్లాలోని మానేరు నదిలో చేపట్టిన ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాణిజ్య అవసరాలకే ఇసుక తవ్వకాలు జరుపుతున్నందున ఎన్విరాన్ మెంటల్ క్లియరెన్స్(ఈసీ) తప్పనిసరి అని తాజాగా ఎన్జీటీ సదరన్​ జోన్ చైన్నై బెంచ్ విడుదల చేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒకవేళ సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీ మానేరులో ఇసుక తవ్వకాలు చేపట్టేందుకు ఈసీ పొంది ఉంటే తవ్వకాలు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు తవ్వకాలపై స్టే కొనసాగుతుందని వెల్లడించింది.

గత డిసెంబర్ లోనూ మానేరు నదిలో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఆ ఆదేశాలను కేవలం మానేరుకు అటువైపు ఉన్న పెద్దపల్లి జిల్లాకే పరిమితం చేసి..ఇటువైపున కరీంనగర్ జిల్లాలో టీఎస్ఎండీసీ యథావిధిగా ఇసుక తోడుతోంది. దీంతో కరీంనగర్ జిల్లాకు చెందిన కొందరు ఎన్జీటీని ఆశ్రయించగా..మరోసారి ఆదేశాలు జారీ చేసింది. మానేరులో 70,32,404 క్యూబిక్ మీటర్ల మేర ఇసుక పేరుకుపోయిందని, దీనిని పూడిక(డీసిల్టింగ్) తీసేందుకు నిరుడు జూలై 8న జిల్లా జిల్లా సాండ్ కమిటీ చైర్మన్ గా ఉన్న కరీంనగర్ కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. టెండర్ లో ఇసుక రీచ్ లను దక్కించుకున్న ఏజెన్సీ..వాణిజ్య అవసరాల కోసం ఏడాది పాటు తవ్వకాలు చేపట్టేలా అనుమతించారు.

అయితే, సాధారణంగా డ్యామ్​లు, రిజర్వాయర్లు, బ్యారేజీలు, నదులు, కాల్వల మెయింటనెన్స్ కోసం ఇసుక ఎక్కువగా పేరుకుపోయినప్పుడు మాత్రమే స్థానిక అవసరాలకు తవ్వకాలు చేపట్టాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో పర్యావరణ అనుమతులు అవసరం లేదు. కానీ, వాణిజ్య అవసరాల కోసమే మానేరులో ఇసుక తవ్వకాలు చేపట్టినందున ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవాల్సిందేనని, ఎలాంటి మినహాయింపులు ఉండవని ఎన్జీటీ బెంచ్ స్పష్టం చేసింది. కరీంనగర్ జిల్లాలోని వావిలాల, ఊటూరు, చల్లూరు, మల్లారెడ్డిపల్లి, కొండపాక, కోరేకల్, పోతిరెడ్డిపల్లిలోనూ తవ్వకాలు నిలిపివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కేసు తదుపరి విచారణను జూలై 5కు వాయిదా వేసింది. 

ఎన్జీటీ ఆదేశాలను అమలు చేయాలి.. 

కరీంనగర్ జిల్లాలోని మానేరులో ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని ఎన్జీటీ చెన్నై బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కలెక్టర్ అమలు చేయాలి. నదిలో ఇసుక తవ్వకాలు, రవాణాను నిలిపి వేయాలి. అక్రమాలను ప్రశ్నిస్తే ఇసుక మాఫియా కేసులతో వేధించింది. ఇసుక మాఫియాలో పెద్దల హస్తం ఉందని బహిరంగ చర్చ జరుగుతోంది. ఇసుక తవ్వకాలతో బోర్లు, బావులు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. రైతుల నోట్లో మట్టి కొడుతూ, భవిష్యత్​తరాలకు తీరని అన్యాయం చేస్తున్న ఇసుక మాఫియాను అరికట్టడానికి  ఐక్యంగా ఉద్యమించాలి.

–సంది సురేందర్ రెడ్డి, మానేరు పరిరక్షణ సమితి