నత్తనడకన ఎన్​హెచ్- 63 విస్తరణ పనులు

నత్తనడకన ఎన్​హెచ్- 63 విస్తరణ పనులు
  •  అటవీశాఖ అనుమతులు వచ్చినా స్పీడ్​ అయితలే
  •  మూడు రాష్ట్రాల ప్రజల కష్టాలు
  •  నిమ్మకు నీరెత్తినట్లుగా కాంట్రాక్ట్​ సంస్థ
  • ఆఫీసర్ల తీరుపై వాహనదారుల ఫైర్​

కోల్​బెల్ట్/ జైపూర్, వెలుగు: తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్​గఢ్​రాష్ట్రాలను కలిపే నిజామాబాద్​–-జగ్దల్​పూర్​ నేషనల్​హైవే 63  విస్తరణ పనులు మూడు రాష్ట్రాల ప్రయాణికులకు చుక్కలు చూపుతున్నాయి.  మొదలై ఆరేండ్లు గడుస్తున్నా పనులు పూర్తికాక గుంతలు, కంకర, దుమ్ము, ధూళితో వాహనదారులకు నరకం కనిపిస్తోంది.  కావాల్సినన్ని ఫండ్స్​, అటవీశాఖ సహా అన్ని అనుమతులు ఉన్నప్పటికీ పనులు పూర్తిచేయడంలో కాంట్రాక్ట్​ సంస్థ వెనుకబడింది. పనులను స్పీడ్​ చేయాల్సిన ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై పబ్లిక్​ మండిపడ్తున్నారు. 

ఆరేళ్లుగా సాగుతున్న విస్తరణ పనులు

నేషనల్​హైవే​63 రాష్ట్రంలో నిజామాబాద్​జిల్లా పెర్కిట్​లో ప్రారంభమై మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం రాపన్​పల్లి మీదుగా మహారాష్ట్రలోని సిరోంచా వెళ్తుంది. తెలంగాణలో 268 కి.మీ. మేర ఈ రోడ్డు ఉంది. మంచిర్యాల జిల్లా జైపూర్ ​మండలం రసూల్​పల్లి వాగు  నుంచి చెన్నూరు బైపాస్​ మీదుగా కోటపల్లి మండల బబ్బెరచెలుక వరకు(నేషనల్​ హైవేలోని 180.60 కి.మీ. నుంచి 223 కి.మీటర్లు) 42.4 కి.మీ. పొడవునా రూ.163.8 కోట్లతో 2017 జనవరిలో రహదారి విస్తరణ పనులను చేపట్టారు. టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్​రావుకు చెందిన మధుకాన్​ ప్రాజెక్ట్​ లిమిటెడ్​ టెండర్ ​దక్కించుకొని పనులు ప్రారంభించింది. 2019 మార్చిలోపు విస్తరణ పనులు చేయాల్సి ఉండగా మరో రెండేండ్లు గడువు పొడిగించారు. ఏడు మీటర్ల జాతీయ రహదారిని పది మీటర్లుగా విస్తరించడంతో పాటు జైపూర్, భీమారం మండల కేంద్రాల్లో మూడు కి.మీ. చొప్పున ఫోర్​లేన్, ఇరువైపులా కాలువల నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉన్నా ఇప్పటివరకు పూర్తికాలేదు. భీమారం,-చెన్నూరు మండలాల సరిహద్దున ఉన్న జోడువాగుల ప్రాంతంలో రిజర్వు ఫారెస్ట్​ఉంది. ఇక్కడ రోడ్డుతో పాటు వంతెన నిర్మాణానికి గత ఏడాది ఆగస్టులో అటవీ, పర్యావరణ శాఖ పర్మిషన్లు వచ్చాయి. కేవలం బ్రిడ్జి వద్ద చెట్లను తొలగించి ఊరుకున్నారు.  భీమారం సమీపంలోని మాంతమ్మ ఆలయం నుంచి జైపూర్​లోని గురుకులం వరకు  సుమారు 8.5 కి.మీ. రహదారిని 10 మీటర్ల వరకు  విస్తరించేందుకు అటవీశాఖ పర్మిషన్లు రావాల్సి ఉంది. 

ఇరుకు వంతెన.. కొనసాగుతున్న పనులు

భీమారం-, చెన్నూరు మండలాల సరిహద్దున ఉన్న జోడువాగుల బ్రిడ్జి వర్క్స్​ఇంకా స్టార్ట్​ కాలేదు. దశాబ్దాల కింద కట్టిన పాతబ్రిడ్జి ఇరుకుగా ఉంది. దీనికి రెండు వైపులా సింగిల్ రోడ్డుపై రెండు కి.మీ. వరకు గుంతలు పడ్డాయి. బ్రిడ్జికి ఇరువైపులా మూలమలుపులు  ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. జైపూర్​ మండలం రసూల్​పల్లి వాగుపై ప్రారంభించిన బ్రిడ్జి నిర్మాణ పనులు ఐదేండ్లవుతున్నా పూర్తికాలేదు. వానాకాలంలో వాగు ఉప్పొంగి ప్రవహించినప్పుడు మూడు రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు రాకపోకలకు  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భీమారం, -పోలంపల్లి మధ్యలో ఏడాదిగా  కల్వర్టు పనులు కొనసాగుతున్నాయి. జోడువాగుల బ్రిడ్జి సమీపంలో భారీ గుంతలు, దుమ్ము, ధూళి కారణంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.  సింగిల్​ రోడ్డు కావడంతో నైట్​టైమ్​లో బైక్​లు గుంతల్లో పడుతున్నాయని, ఇసుకలారీలు, భారీ వెహికల్స్​తో యాక్సిడెంట్లు జరుగుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్​ నిర్లక్ష్యం వల్లే జాప్యం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. 

ఆఫీసర్లు పట్టించుకుంటలేరు

ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతోనే రోడ్డు విస్తరణ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. పెరిగిన ట్రాఫిక్​తో నిత్యం ఇబ్బందులు పడుతున్నాం. ఇరుకైన రోడ్డు కావడంతో బ్రిడ్జి వద్ద యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. జోడువాగులపై కొత్త బ్రిడ్జి వర్క్స్​ స్టార్ట్​ చేయలేదు. ఫారెస్ట్​లో రోడ్డు వెడల్పుకు పర్మిషన్​ వచ్చినా పనులు చేయడం లేదు. 
- వెల్పుల శ్రీనివాస్, బీజేపీ లీడర్​


ఏప్రిల్ లోపు పూర్తి చేస్తాం

నేషనల్ హైవే 63 విస్తరణ పనులు ఏప్రిల్ 2023లోపు పూర్తి చేయాల్సి ఉంది. ఫారెస్ట్​లో సంబంధిత శాఖ  పూర్తిస్థాయిలో చెట్లను తొలగించిన తర్వాత రోడ్డు విస్తరణ పనులు చేపడతాం. 
- అన్నయ్య, నేషనల్ హైవే డీఈ