సంక్రాంతికి సొంతూళ్లకు!.విజయవాడ హైవేపై కార్ల జాతర..

సంక్రాంతికి సొంతూళ్లకు!.విజయవాడ హైవేపై కార్ల జాతర..
  •     గుంటూరు, ఖమ్మం వైపు వెళ్లే రూట్లలో వాహనాల డైవర్షన్  
  •     డ్రోన్లతో ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తున్న సూర్యాపేట పోలీసులు

నల్గొండ, వెలుగు : హైదరాబాద్ లో ఉంటున్న ఏపీ ప్రజలు  సంక్రాంతికి సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో -విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. శనివారం ఉదయం నుంచే హైవే పై వాహనాలు క్యూ కట్టాయి.  యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ పరిధి పంతంగి, నల్గొండ జిల్లా కొర్లపహాడ్‌ టోల్‌ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. పంతంగి టోల్‌ ప్లాజా వద్ద ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయాయి. దీంతో రోడ్డు విస్తరణ పనులు జరిగే ప్రాంతాల్లో వాహనాలు స్లోగా ముందుకు కదులుతుండగా.. పెద్దకాపర్తి, చిట్యాల వద్ద గంటల తరబడి నిలిచిపోగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. శనివారం సాయంత్రం వరకు 40 వేల వాహనాలు ఏపీ వైపు వెళ్లినట్లు పోలీసులు చెప్పారు. హైవేపై వాహనాల రద్దీ పెరిగినందున విజయవాడకు వెళ్లే వాహనాలు భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాల మీదుగా, గుంటూరు, ఒంగోలు వైపు వెళ్లే వాహనాలు సాగర్‌ హైవే మీదుగా వెళ్లాలని సూచించారు. 

ట్రాఫిక్ జామ్ లు కాకుండా చర్యలు 

హైవేపై ఒక్కసారిగా వాహనాల సంఖ్య పెరగడంతో యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల పోలీసులు  ట్రాఫిక్‌ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచే వాహనాల రద్దీ మొదలైంది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. కొర్లపహాడ్ టోల్‌ ప్లాజా వద్ద 12 బూత్‌లు ఉండగా.. విజయవాడ వైపు 8, హైదరాబాద్‌ వైపు 4 బూత్‌లను ఓపెన్‌ చేసి వెహికల్స్ ను పంపిస్తున్నారు. హైవే పై వెళ్లే వాహనాలకు అంతరాయం లేకుండా చౌటుప్పల్‌ టౌన్ లో నారాయణపురం రోడ్డును మూసివేశారు. గుంటూరు వైపు వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి నుంచి మిర్యాలగూడ వైపు మళ్లిస్తున్నారు. -రాజమండ్రి, కాకినాడ, వైజాగ్‌, శ్రీకాకుళం వైపు వెళ్లే వాహనాలను నకిరేకల్ నుంచి అర్వపల్లి మీదుగా, టేకుమట్ల వద్ద నుంచి ఖమ్మం వైపు మళ్లిస్తున్నారు.  ఖమ్మం నుంచి సూర్యాపేట వైపు హైదరాబాద్ వెళ్లే వాహనాలను చివ్వెంల మండలం వట్టి ఖమ్మంపహాడ్ వద్ద సర్వీస్ రోడ్డు నుంచి డైవర్షన్‌ చేస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తూ.. ట్రాఫిక్ పై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నట్లు సూర్యాపేట ఎస్పీ నరసింహ తెలిపారు.

పంతంగి, గూడూరు టోల్ ప్లాజాల వద్ద రద్దీ​ 

యాదాద్రి, చౌటుప్పల్​: నేషనల్​హైవేలపై వాహనాల  రద్దీ పెరుగుతోంది.  పంతంగి, గూడూరు టోల్​గేట్ల వద్ద యాదాద్రి ఎస్పీ అకాంక్ష్​ యాదవ్​ నేతృత్వంలో  పోలీసులు ట్రాఫిక్‌ చర్యలు తీసుకుంటున్నారు. పంతంగి టోల్​ ప్లాజా వద్ద  ట్రాఫిక్​ జామ్​కాకుండా 16 గేట్లలో 12 గేట్లు విజయవాడ వైపు ఓపెన్​ చేశారు.  దీంతో వెంట వెంటనే వెహికల్స్​వెళ్లిపోతున్నాయి. వరంగల్​హైవేపై శనివారం సాయంత్రం వరకు 50 వేల వెహికల్స్​ప్రయాణించాయి.  ట్రాఫిక్​ జామ్​ కాకుండా 160 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.  హైవేలపై రెండు హైడ్రాలిక్​ క్రేన్లు, రెండు అంబులెన్సులను రెడీగా ఉంచారు. వాహనాల్లో ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చిన వెంటనే రిపేర్ చేసేందుకు చౌటుప్పల్​బస్టాండ్​ వద్ద మెకానిక్​లను అందుబాటులో ఉంచారు. బస్సుల్లో రద్దీని నివారించేందుకు ఆర్టీసీ  స్పెషల్​ బస్సులు నడిపించింది.  

పూలు ఇచ్చి విషెష్‌ చెప్పి పంపిస్తూ.. 

ఏపీకి వెళ్లే ప్రయాణికుల రక్షణ లక్ష్యంగా సూర్యాపేట జిల్లా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. వాహనదారులను ఆపి పూలు అందించి పండుగ శుభాకాంక్షలు చెబుతూ జాగ్రత్తగా వెళ్లాలని  సూచిస్తున్నారు. సూర్యాపేట టౌన్ లో హైవే పై ఎఫ్‌సీఐ గోడౌన్ వద్ద కార్లు, బస్సులను ఆపి పండుగను కుటుంబాలతో సంతోషంగా నిర్వహించుకోవాలని పోలీసులు పూలు ఇచ్చి పంపిస్తున్నారు. ఊరికి త్వరగా చేరుకోవాలనే ఆత్రుతతో వేగంగా వెళ్లొద్దని, అలసటగా అనిపిస్తే వాహనాన్ని ఆపి విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు.