గురుకులాల్లో ఫుడ్‌‌పాయిజన్ ఘటనలపై ఏం చర్యలు తీసుకున్నరు : ఎన్‌‌హెచ్‌‌ఆర్‌‌‌‌సీ

గురుకులాల్లో ఫుడ్‌‌పాయిజన్ ఘటనలపై ఏం చర్యలు తీసుకున్నరు : ఎన్‌‌హెచ్‌‌ఆర్‌‌‌‌సీ
  • నాలుగు వారాల్లో సమగ్ర నివేదిక అందించండి

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలోని గురుకులాల్లో ఫుడ్‌‌ పాయిజన్‌‌ ఘటనలపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌‌(ఎన్‌‌హెచ్‌‌ఆర్‌‌‌‌సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. 886 ఫుడ్ పాయిజన్‌‌ ఘటనల్లో 48 మంది మృతికి బాధ్యులైన కాంట్రాక్టర్లు, అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం ఇచ్చేందుకు చర్యలు చేపట్టామని అధికారులు కమిషన్‌‌కు వివరించారు. దీంతో పూర్తి వివరాలతో 4 వారాల్లో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో నమోదైన 109 మానవ హక్కుల ఉల్లంఘనల కేసులకు సంబంధించి జూబ్లీ హిల్స్‌‌లోని ఎంసీఆర్‌‌ హెచ్‌‌ఆర్‌‌డీలో సోమ, మంగళవారాల్లో ఎన్​హెచ్​ఆర్​సీ బహిరంగ విచారణ జరిపింది.

 అందులో 87 కేసులు క్లోజ్‌‌ చేసింది. మంగళవారం ప్రభుత్వ సీనియర్ అధికారులతో ఎన్జీఓలు, మానవహక్కుల ఉద్యమకారులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించింది. అనంతరం ఎన్‌‌హెచ్‌‌ఆర్‌‌సీ చైర్‌‌ పర్సన్‌‌ జస్టిస్‌‌ వి రామసుబ్రమణియన్‌‌ మీడియాతో మాట్లాడారు. దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి ఎన్‌‌హెచ్‌‌ఆర్‌‌‌‌సీకి ప్రతి రోజు 250‌‌‌‌ వరకు ఆన్‌‌లైన్ ఫిర్యాదులు అందుతున్నాయని వెల్లడించారు. తెలంగాణలో 4 పోలీస్‌‌ కస్టడీ మరణాలు, 30  జ్యుడీషియల్‌‌ కస్టడీ మరణాల కేసులు పెండింగ్‌‌లో ఉన్నట్టు పేర్కొన్నారు.