
ఇంటర్ ఫలితాల వివాదం, విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఇంటర్ ఫలితాల వివాదంపై 4 వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఫలితాల్లో తప్పులు, ఆత్మహత్యలు, నిరసనలలపై మీడియాలో వచ్చిన వార్తలను సుమోటోగా తీసుకుంది NHRC. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బాధిత కుటుంబాలకు ఎలాంటి సహాయం చేశారో నివేదిక ఇవ్వాలని చెప్పింది జాతీయ మానవ హక్కుల కమిషన్.
మార్చి 2019 నుంచి 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించి యాక్షన్ తీసుకుంది NHRC. మీడియాలో వచ్చిన కథనాలే నిజమైతే… అధికారుల మధ్య సమన్వయం కారణంగా… మానవ హక్కుల ఉల్లంఘన తీవ్రస్థాయిలో జరిగినట్టుగా భావించాల్సి వస్తుందని నోటీసులో తెలిపింది కమిషన్. ఈ విషయంపై సునిశిత విచారణ అవసరమనీ… నిందితులను శిక్షించాలనీ.. ఫ్యూచర్ లో ఇలాంటి బాధాకరమైన సంఘటనలు జరగకుండా చూడాలని అభిప్రాయపడింది.
విద్యార్థుల మార్కులను గతంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ప్రాసెస్ చేసేదని.. ఇప్పుడు మాత్రం గ్లోబరినా టెక్నాలజీస్ చేసినట్టుగా తమ దృష్టికి వచ్చినట్టు చెప్పింది కమిషన్. ఐతే.. ఈ సంస్థకు అంత సామర్థ్యం లేనట్టుగా కనిపిస్తోందని అభిప్రాయపడింది. సామర్థ్యం లేని సంస్థకు బాధ్యత అప్పగించి.. కీలకమైన పని చేయించినట్టుగా అనిపిస్తోందని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంపై సవివర నివేదికను 4 వారాల్లోగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది.