కేబీఆర్ పార్క్ వద్ద పర్యావరణవేత్తల అరెస్ట్‌‌‌‌‌‌‌‌పై ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌సీ సీరియస్

కేబీఆర్ పార్క్ వద్ద పర్యావరణవేత్తల అరెస్ట్‌‌‌‌‌‌‌‌పై ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌సీ సీరియస్
  • డీజీపీ, హైదరాబాద్ కలెక్టర్‌‌కు నోటీసులు 
  • 14 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం

న్యూఢిల్లీ, వెలుగు: కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) నేషనల్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతను నిరసిస్తూ ఆందోళన చేపట్టిన ఐదుగురు పర్యావరణవేత్తలను అరెస్ట్ చేయడంపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌‌హెచ్‌‌ఆర్‌‌సీ) సీరియస్ అయింది. ఈ ఘటన తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరిస్తూ..రాష్ట్ర డీజీపీ, హైదరాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్‌‌)లకు బుధవారం నోటీసులు జారీ చేసింది.

ఈ నెల  13న  తేదీన కేబీఆర్ పార్క్ వద్ద చెట్లను నరికేయడాన్ని వ్యతిరేకిస్తూ... పలువురు పర్యావరణవేత్తలు ఆందోళనకు చేపట్టారు. నిరసనలో పాల్గొన్న ఐదుగురిని పోలీసులు నిర్బంధించారు. అనంతరం వారిపై పలు సెక్షన్లతో పోలీసులు ఎఫ్‌‌ఐఆర్ ఫైల్ చేశారు. ఆస్తికి నష్టం కలిగించడం, అక్రమంగా అడ్డుకోవడం, నేరపూరిత బెదిరింపులకు పాల్పడటం లాంటి ఆరోపణలు ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు. కాగా.... వారిని పోలీసులు బెయిల్‌‌పై విడుదల చేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, రెండు వారాల్లోగా తమకు సమగ్ర నివేదిక సమర్పించాలని డీజీపీ, హైదరాబాద్ కలెక్టర్ లను ఎన్‌‌హెచ్‌‌ఆర్‌‌సీ ఆదేశించింది. పర్యావరణవేత్తల అరెస్టుపై వార్తా కథనాల్లోని అంశాలు నిజమైతే అది కచ్చితంగా తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొంది.