అమెరికన్, ఆరుగురు ఉక్రెయినియన్లు అరెస్ట్

అమెరికన్, ఆరుగురు ఉక్రెయినియన్లు అరెస్ట్
  • ఉపా చట్టం కింద కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ 
  • మయన్మార్​కు వెళ్లి మిలిటెంట్లకు 
  • డ్రోన్ వార్​లో ట్రెయినింగ్ ఇచ్చినట్టు నిందితులపై ఆరోపణలు 

న్యూఢిల్లీ: ఇండియాకు టూరిస్ట్ వీసాల మీద వచ్చి అక్రమంగా మయన్మార్‌‌ కు వెళ్లి సాయుధ మిలిటెంట్ గ్రూపులకు డ్రోన్ యుద్ధతంత్రంలో శిక్షణ ఇచ్చారన్న ఆరోపణలపై ఒక అమెరికన్, ఆరుగురు ఉక్రెయిన్ పౌరులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. వీరందరిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ–-ఉపా) కింద కేసు నమోదు చేయగా.. ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు11 రోజుల ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది.

నిందితుల్లో అమెరికా పౌరుడు మాథ్యూ వాన్‌‌డైక్‌‌ ను కోల్‌‌కతా నుంచి అరెస్ట్ చేయగా.. ఉక్రెయిన్ పౌరులైన గుర్బా పెట్రో, స్లివియాక్ తారాస్, ఇవాన్ సుక్మనోవ్‌‌స్కీ, స్టీఫాంకివ్ మరియన్, హోంచరుక్ మాక్సిమ్, కమిన్స్కీ విక్టర్ లను లక్నో, ఢిల్లీల్లో అదుపులోకి తీసుకున్నారు. వీరంతా పర్యాటక వీసాలపై భారత్‌‌లోకి ప్రవేశించి.. గువహటి, మిజోరాం మార్గాల ద్వారా అక్రమంగా మయన్మార్‌‌లోకి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది.

మయన్మార్‌‌లోని సాయుధ గ్రూపులకు డ్రోన్ ఆపరేషన్లు, ఆయుధాల వినియోగంపై వీరు శిక్షణ ఇస్తున్నట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఈ గ్రూపులకు భారత్‌‌లోని నిషేధిత ఉగ్రవాద సంస్థలతో కూడా సంబంధాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థ భావిస్తోంది. వీరు ఐరోపా నుంచి భారీగా డ్రోన్లను భారత్ మీదుగా మయన్మార్‌‌కు తరలించినట్లు ఎన్ఐఏకు ప్రాథమిక సమాచారం అందింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, డిజిటల్ ఆధారాలను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. 

అమెరికా, ఉక్రెయిన్ స్పందన..  

తమ పౌరుడి అరెస్టుపై అమెరికా రాయబార కార్యాలయం స్పందిస్తూ.. తాము పరిస్థితిని గమనిస్తున్నామని, అయితే వ్యక్తిగత గోప్యత కారణాల వల్ల దీనిపై వ్యాఖ్యానించలేమని పేర్కొంది. తమ పౌరుల బంధువులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ తెలిపింది. ప్రస్తుతం భారత దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని వెల్లడించింది. కాగా, మిజోరం రాష్ట్రం విదేశీయులకు ట్రాన్సిట్ రూట్‌‌గా మారుతుండటంపై ముఖ్యమంత్రి లాల్‌‌దుహోమా అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేశారు.

2024 జూన్ నుంచి డిసెంబర్ మధ్య సుమారు 2,000 మంది విదేశీయులు రాష్ట్రానికి వచ్చారని, వారిలో చాలామంది పర్యాటకులు కారని ఆయన వెల్లడించారు. సరిహద్దులు దాటి మయన్మార్‌‌లోని చిన్ హిల్స్ ప్రాంతంలో సైనిక శిక్షణ ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ భద్రతా కారణాల దృష్ట్యా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ 'ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్' పునరుద్ధరణకు తమ ప్రభుత్వం సహకరిస్తోందని చెప్పారు.