జర్నలిస్టులపై ఎన్ఐఏ దాడులను ఖండించాలి

జర్నలిస్టులపై ఎన్ఐఏ దాడులను ఖండించాలి

ఖైరతాబాద్​,వెలుగు: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జోక్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని పలువురు వక్తలు కోరారు. వీక్షణం సంపాదకుడు వేణు ఇంటిపై ఈనెల 8న ఎన్ఐఏ దాడి చేసి సెల్​ఫోన్ ​ఎత్తుకు పోయిన నేపథ్యంలో  వీక్షణం కలెక్టివ్​ ఆధ్వర్యంలో ‘జర్నలిస్టులపై ఎన్ఐఏ దాడులను ఖండించండి’ అంశంపై బుధవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో  సీనియర్​ జర్నలిస్టులతో రౌండ్​టేబుల్​ సమావేశం జరిగింది. ఎడిటోరియల్​ కలెక్టివ్​సభ్యుడు ఎ.నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్​ మాట్లాడుతూ దేశంలో,రాష్ట్రంలోని అన్ని ప్రజాసంస్థలను, వ్యవస్థలను ధ్వంసం చేసిన పాలకులు జర్నలిస్టుల మీద దాడిచేస్తున్నారని ఆరోపించారు.  

స్వేచ్ఛగా అభిప్రాయాలు ప్రకటించే  జర్నలిస్టులు 10 ఏండ్లలో ఆ స్థానాన్ని పోగొట్టుకున్నారని సంపాదకుడు కె.శ్రీనివాస్​ పేర్కొన్నారు.  పాలకులు జర్నలిస్టుల విశ్వసనీయతను పోగొట్టాలని ప్రయత్నిస్తున్నారని,దానిలోభాగమే దాడులు, తప్పుడు ఆరోపణలు, కేసులు అన్నారు.  సీనియర్​జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి,   ప్రెస్ అకాడమీ మాజీ అధ్యక్షుడు అల్లం నారాయణ,  సీనియర్​ జర్నలిస్టు  కె.శ్రీనివాస్​రెడ్డి, తెలంగాణ యూనియన్​ ఆఫ్​వర్కింగ్​జర్నలిస్ట్స్​ అధ్యక్షుడు విరాహత్ అలీ, కల్లూరి భాస్కరం, ఎం.రహమాన్​, మారుతీ సాగర్​తదితరులు పాల్గొని  మాట్లాడారు.