తెలంగాణ, ఏపీలో 40 చోట్ల తనిఖీలు 

తెలంగాణ, ఏపీలో 40 చోట్ల తనిఖీలు 
  • పీఎఫ్ఐతో లింకులపై ఎన్ఐఏ సోదాలు
  • తెలంగాణ, ఏపీలో 40 చోట్ల తనిఖీలు 
  • 26 మందికి పైగా అనుమానితులు
  • అదుపులో ఏడుగురు 
  • విచారణకు రావాలని మరికొంత మందికి నోటీసులు
  • ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసిన నిజామాబాద్ పోలీసులు 
  • టెర్రర్ దాడులు, మత కలహాలకు కుట్ర చేస్తున్నదని పీఎఫ్ఐపై కేసు 

హైదరాబాద్‌‌/ నెట్​వర్క్​, వెలుగు:  దేశంలో టెర్రర్ దాడులు, మత కలహాలు సృష్టించేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కుట్ర చేస్తున్నదన్న సమాచారంతో ఆ సంస్థ కార్యకలాపాలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) నిఘా పెట్టింది. నిజామాబాద్‌‌ స్టేషన్ లో ఈ ఏడాది జులై 4న నమోదైన కేసు ఆధారంగా ఆగస్టు 26న ఎన్​ఐఏ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దర్యాప్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుంచే ఏపీ, తెలంగాణలోని 40 ప్రాంతాల్లో ఆకస్మిక సోదాలు చేసింది. రాష్ట్రంలోని 38 ప్రాంతాలు, ఏపీలోని రెండు చోట్ల తనిఖీలు చేపట్టింది. రాష్ట్రంలోని హైదరాబాద్‌‌, నిజామాబాద్‌‌, జగిత్యాల, నిర్మల్‌‌, ఆదిలాబాద్‌‌, కరీంనగర్‌‌‌‌ జిల్లాల్లో.. ఏపీలోని కర్నూల్ జిల్లా నంద్యాల, గుంటూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని ఖాజానగర్‌‌‌‌లో దాడులు చేసింది. మొత్తం 26 మందికి పైగా అనుమానితులను గుర్తించగా.. వారిలో ఏడుగురిని అదుపులోకి తీసుకుంది. మన రాష్ట్రంలో  నలుగురిని, ఏపీలో ముగ్గుర్ని అదుపులోకి తీసుకుంది. మరికొంత మందికి నోటీసులు ఇచ్చి సోమవారం మాదాపూర్‌‌‌‌లోని ఎన్‌‌ఐఏ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ సోదాల్లో హార్డ్‌‌డిస్క్‌‌లు, సీసీ కెమెరాల డీవీఆర్​లు,పెన్‌‌ డ్రైవ్స్, డీవీడీలు తదితర డిజిటల్ డివైజ్ లు, రెండు డాగర్లు, రూ.8.31 లక్షల క్యాష్ స్వాధీనం చేసుకుంది.  

ఎన్ఐఏ నిజామాబాద్ లో 23 చోట్ల తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్‌‌‌‌లో 4, జగిత్యాలలో 7, నిర్మల్‌‌‌‌లో 2, ఆదిలాబాద్‌‌‌‌, కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాల్లో సోదాలు చేసింది. దాడులు జరుగుతున్న టైమ్ లో చాలామంది అందుబాటులో లేరని తెలిసింది. దీంతో వారి కుటుంబసభ్యులకు ఎన్ఐఏ నోటీసులు అందజేసింది.  నిజామాబాద్​లోని ఆటోనగర్​లో పీఎఫ్ఐలో శిక్షణ పొందిన డిగ్రీ విద్యార్థి సయ్యద్ సమీర్​ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 3 ల్యాప్ టాప్ లు, ఫోన్లు, ప్రింటర్ స్వాధీనం చేసుకున్నారు. ఎడపల్లిలోని ఎంఎస్ సీ ఫామ్ లో ఆన్ లైన్ సెంటర్ నిర్వాహకుడు షేక్ ముఖీమ్​ ఇంట్లో డాక్యుమెంట్లు, పాస్ పోర్ట్, బ్యాంక్ లావాదేవీల పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ లోని మరికొన్ని ప్రాంతాలు, ఆర్మూర్​లోని జిరాయత్​నగర్​లో సోదాలు నిర్వహించినా వివరాలు బయటకు రాలేదు.  

నిర్మల్ జిల్లా భైంసాలో ఎస్సే సాజిద్, ఎండీ అయాజ్ ఇండ్లలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేశారు. కొన్ని రోజులుగా వారు ఇండ్లలో లేరని తెలిసింది. భైంసాలో తనిఖీల తర్వాత ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన అధికారులు.. శాంతినగర్, ఖానాపూర్, బొక్కల గూడ కాలనీల్లో సోదాలు నిర్వహించారు. శాంతినగర్ లో నిజామాబాద్ కు చెందిన ఫిరోజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడు పీఎఫ్ఐలో శిక్షణ తీసుకొని ఆదిలాబాద్ లో అద్దెకు ఉంటూ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.  కరీంనగర్ లోని హుస్సేనిపురాలో మొహమ్మద్ ఇర్ఫాన్ అహ్మద్ కుటుంబం అద్దెకు ఉంటోంది. వీరిది జగిత్యాల కాగా కొద్దిరోజుల క్రితమే ఇక్కడికి వచ్చారు. తెల్లవారుజామున ఎన్ఐఏ అధికారులు వెళ్లి తలుపు కొట్టగా ఇర్ఫాన్ తీయలేదు. అతను డయల్ 100కు ఫోన్ చేయగా దాదాపు 5 గంటల ప్రాంతంలో త్రీటౌన్ పోలీసులు వచ్చారు. ఆ తర్వాత ఇర్ఫాన్ తలుపు తీయగా అధికారులు సోదాలు చేశారు. ఇర్ఫాన్ ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్, పాన్ కార్డు, పీఎఫ్ఐ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. ఇర్ఫాన్ ను అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కు తరలించారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌‌‌‌లోని సూరారం అమీద్‌‌‌‌ బస్తీలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేశారు. సీసీ టీవీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్, హార్డ్‌‌‌‌డిస్క్‌‌‌‌లను స్వాధీనం చేసుకున్నారు. మహీద్‌‌‌‌ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌ 7, పాతబస్తీలోని మరో రెండు ప్రాంతాల్లోనూ అధికారులు సోదాలు చేశారు. 

అసలేంటీ కేసు? 

దేశంలో విధ్వంసాలకు కుట్ర చేస్తున్నారనే సమాచారంతో జులై 4న పీఎఫ్ఐపై నిజామాబాద్‌‌‌‌ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. పీఎఫ్‌‌‌‌ఐ కన్వీనర్లు అబ్దుల్‌‌‌‌ ఖదీర్‌‌‌‌‌‌‌‌, షేక్‌‌‌‌ సహదుల్లా, మహ్మద్‌‌‌‌ ఇమ్రాన్‌‌‌‌, అబ్దుల్‌‌‌‌ మొబిన్‌‌‌‌లను అరెస్ట్ చేశారు. ఈ కేసులో టెర్రర్ లింకులు బయటపడడంతో ఆగస్టు 26న ఎన్‌‌‌‌ఐఏ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు మొదలుపెట్టింది. ఏపీ, తెలంగాణలో యాక్టివ్ గా ఉన్న పీఎఫ్ఐ నేతల డేటా సేకరించింది. కరాటే, లీగల్ అవేర్ నెస్ పేరుతో పీఎఫ్‌‌‌‌ఐ టెర్రర్ శిక్షణ ఇస్తోందని ఆధారాలు సేకరించింది. ఈ క్యాంపుల్లో 500 మందికి పైగా ట్రైనింగ్ పొందినట్లు ఎన్ఐఏ ఆధారాలు సేకరించిందని తెలిసింది. వీరిలో మైనర్లు కూడా ఉన్నారని సమాచారం. 2006లో ఏర్పాటైన నేషనల్ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌(ఎన్‌‌‌‌డీఎఫ్‌‌‌‌) నుంచి పాపులర్ ఫ్రంట్‌‌‌‌ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) అవతరించింది.