2022లో 456మందిని అరెస్టు చేసిన ఎన్‌ఐఏ

2022లో 456మందిని అరెస్టు చేసిన ఎన్‌ఐఏ

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) 2022లో రికార్డు స్థాయిలో 73 కేసులు నమోదు చేసింది. ఇది 2021లో నమోదైన కేసుల కంటే 19.67 శాతం ఎక్కువ. ముంబై 26/11 ఉగ్రదాడి అనంతరం ఎన్‌ఐఏను ప్రారంభించిన అనంతరం ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. జమ్మూకశ్మీర్, అసోం, బీహార్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో జిహాదీ ఉగ్రవాద కేసులను ఎన్‌ఐఏ నమోదు చేసింది. అందులో జమ్మూకశ్మీర్‌లో 11, 10 వామపక్ష తీవ్రవాద కేసులు, ఈశాన్య రాష్ట్రాల్లో 5, పీఎఫ్ఐ సంబంధిత కేసులు 7, పంజాబ్ లో 5 కేసులు, 3 గ్యాంగ్‌స్టర్- టెర్రరిజం కేసులు, తీవ్రవాద నిధుల కేసు, ఫేక్ కరెన్సీ నోట్లకు సంబంధించి 2 కేసులు ఉన్నాయి. ఈ సంవత్సరం ఎన్‌ఐఏ చేపట్టిన దాడుల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై జరిగిన సోదాలు వార్తల్లో నిలిచింది. 

ఎన్ఐఏ ఈ ఏడాది 368 మందిపై 59 ఛార్జ్ షీట్లు దాఖలు చేయగా...19 మంది పరారీలో ఉన్నట్టు తెలిపింది. మరో 456 మంది నిందితులను అరెస్టు చేసినట్టు ప్రకటించింది. ఈ ఏడాది వివిధ న్యాయస్థానాలు 38 కేసులకు సంబంధించి తీర్పులు ప్రకటించాయని చెప్పింది. ఆ తీర్పుల్లో 109 మందికి కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించగా.. ఆరుగురికి జీవిత ఖైదు పడిందని వెల్లడించింది.