రంగారావు కు నోటీసులు రాజకీయ కక్ష సాధింపే...వామపక్ష పార్టీల నేతల ఆరోపణ

రంగారావు కు నోటీసులు రాజకీయ కక్ష సాధింపే...వామపక్ష పార్టీల నేతల ఆరోపణ

హైదరాబాద్‌‌, వెలుగు: సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుకు ఎన్ఐఏ నోటీసులు జారీ చేయడం ముమ్మాటికీ రాజకీయ కక్షసాధింపేనని వామపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. ఈ మేరకు శనివారం వారు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. రంగారావుకు ఇచ్చిన నోటీసులను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 

గాదె ఇన్నయ్య అరెస్ట్ విషయంలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని, ముందస్తు సమాచారం లేకుండా అరెస్ట్​చేయడం సరికాదని రంగారావు కోరారన్నారు. అంతకుమించి ఆయనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కేయడానికే కేంద్రం ఇలాంటి కుట్రలకు తెరలేపుతోందని మండిపడ్డారు. 

ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలను, మావోయిస్టులను హత్య చేస్తూ భయోత్పాతం సృష్టిస్తోందన్నారు. మార్చి 31 తర్వాత అర్బన్ నక్సలైట్లపై కఠిన చర్యలు ఉంటాయని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ప్రకటిస్తున్నారని.. అందులో భాగంగానే పోటు రంగారావు వంటి ప్రజా నేతలపై నోటీసుల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్లు అర్థమవుతోందని తెలిపారు. కేంద్రం అణచివేత ధోరణిని వీడకుంటే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని సీపీఐ నేతలు హెచ్చరించారు.