నడిరోడ్డుపై ప్యాసింజర్ ట్రక్ బోల్తా: 30 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు

నడిరోడ్డుపై ప్యాసింజర్ ట్రక్ బోల్తా: 30 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు

అబుజా: నైజీరియా దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కనీసం 30 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కానో రాష్ట్రం గెజావా ప్రాంతంలోని క్వానార్ బార్డే పట్టణంలోని ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. 

ప్రయాణికులు, సరుకుల లోడ్‎తో వెళ్తున్న భారీ ట్రక్ అతి వేగంతో దూసుకు వెళ్లి అదుపు తప్పి బోల్తా పడిందని అధికారులు తెలిపారు. ట్రక్ కానో నుంచి గుజుంగు పట్టణం వైపు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. 

క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనలో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. కానో రాష్ట్ర గవర్నర్ అబ్బా కబీర్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. డ్రైవర్ నిర్లక్ష్యంగానే ఈ ప్రమాదం జరిగిందన్నారు.