రాత్రిపూట కడుపు నిండుగా ఉండి, గుండెల్లో మంట, అజీర్ణం లేదా సరిగ్గా నిద్ర లేకపోవడం వంటి సమస్యలతో పడుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆలస్యంగా తినడం, ఎక్కువగా తినడం లేదా కారంగా ఉండే ఆహారం తీసుకోవడం, తిన్న వెంటనే పడుకోవడం వంటి అలవాట్లు హార్మోన్ల బ్యాలెన్స్ ని దెబ్బతీస్తాయి, జీర్ణ ప్రక్రియని తగ్గిస్తాయి అలాగే నిద్రను కూడా పాడుచేస్తాయి. దీనివల్ల తరువాత రోజు మీకు అలసటగా, గజిబిజిగా ఆనిపిస్తుంది. ఇందుకు మంచిగా జీర్ణం అయ్యేలా, మంచి నిద్ర పొందడానికి సహాయపడే రాత్రిపూట అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది.
పడుకోవడానికి 2-3 గంటల ముందు: మీరు రాత్రి నిద్రపోవడానికి కనీసం 2-3 గంటల ముందు భోజనం చేయడం మంచిది. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల నిద్ర పట్టడానికి ఎక్కువ సమయం పడుతుంది, రాత్రిపూట ఎక్కువగా మేల్కువ వస్తుంది ఇంకా నిద్ర నాణ్యత తగ్గుతుంది. ఒకవేళ మీకు రాత్రి తిన్నాక కూడా ఆకలి అనిపిస్తే పండ్లు లేదా పాల పదార్ధాలు వంటి తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి.
రాత్రి పూట భోజనం: అధిక కొవ్వు, మోతాదుకు మించి లేదా కారంగా ఉండే ఆహారాలు గుండెల్లో మంటను (రిఫ్లక్స్) పెంచుతాయి అలాగే మీ జీర్ణ ప్రక్రియను నెమ్మది చేస్తాయి. దీనికి బదులు తక్కువ కొవ్వు, తక్కువ కారం , చిన్న మొత్తంలో మాంసకృత్తులు (lean protein), కూరగాయలు లేదా ధాన్యాలు ఉన్న ఆహారం మంచిది. ఎక్కువగా లేదా కడుపు నిండే ఆహారాలను నిద్రపోయే సమయానికి తినకండి.
భోజనం తర్వాత కొద్దిసేపు నడవడం : రాత్రి భోజనం తర్వాత కాసేపు నడవడం జీర్ణ ప్రక్రియకు సహాయపడుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తుంది ఇంకా కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. రాత్రి భోజనం చేసాక 20-60 నిమిషాల తర్వాత 10-15 నిమిషాల పాటు నడవండి. ఇలా చేస్తే జీర్ణ వ్యవస్థలో కదలికను ప్రోత్సహిస్తుంది.
తిన్న వెంటనే పడుకోవడం: తిన్న వెంటనే పడుకోవడం వల్ల కడుపులో ఆమ్లాలు పైకి వచ్చి గుండెల్లో మంట కలిగే ప్రమాదం పెరుగుతుంది. రాత్రి భోజనం తర్వాత కనీసం 30-45 నిమిషాలు నిలువుగా కూర్చోండి లేదా నిలబడండి. రెస్ట్ తీసుకునేటప్పుడు లేదా వంగి ఉన్నప్పుడు తల పైకి ఉండేలా దిండ్లు లేదా అడ్జస్ట్ చేయగల మంచాన్ని ఉపయోగించండి.
ఎడమ వైపు పడుకోవడం : సాధ్యమైనప్పుడల్లా ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల రాత్రిపూట ఆమ్లం పైకి రావడం తగ్గుతుంది ఇంకా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. గుండెల్లో మంట ఉన్నట్లయితే దిండ్లు లేదా ఏదైనా ఉపయోగించి శరీరాన్ని 30 డిగ్రీల వరకు ఎత్తులో ఉంచండి, సమానంగా పడుకోకుండా.
సరేన సమయానికి భోజనం, నిద్ర : ప్రతిరోజూ ఒకే సమయానికి భోజనం చేయడం, ఒకే టైంకి నిద్ర పాటించడం వల్ల మీ ఇంటర్నల్ బాడీ క్లాక్ (Circadian rhythms) మెరుగుపడుతుంది. జీర్ణక్రియను మరింత సమర్థవంతంగా చేస్తుంది, మంచి నిద్రను పెంచుతుంది.
ఈ చిన్న చిన్న మార్పులు మీ రాత్రిపూట అలవాట్లలో చేర్చుకోవడం ద్వారా, మీరు జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు, నిద్ర నాణ్యతను మెరుగుపరచుకోవచ్చు అలాగే తరువాత రోజు ఉత్సాహంగా ఉండోచ్చు.
