ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ గా తెలంగాణ బిడ్డ

ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ గా తెలంగాణ బిడ్డ
  • తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ సంచలనం...
  • వరల్డ్ ఉమెన్స్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం

ఆర్థిక కష్టాలు వెంటాడిన వెనుకంజ వేయలేదు. కుటుంబంలో నలుగురు ఆడపిల్లలున్నా అధైర్యపడలేదు. తండ్రి ప్రోత్సాహంతో 12 ఏళ్ల వయసులో ఉత్సాహంగా బాక్సింగ్ రింగులోకి దిగింది. పతకాల పంచులతో  ఇందూరు నుంచి ఇంటర్నేషనల్ వరకు ఎదిగింది. తాజాగా ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ ను సొంతం చేసుకుని చరిత్రను లిఖించింది. థాయిలాండ్ ప్లేయర్ జిట్‌పాండ్ జుటమాస్‌తో జరిగిన ఫైనల్ లో బంగారు పతకం సాధించింది. మొదటి బౌట్ లో నిఖత్ జరీన్ ఆధిక్యం కనపర్చింది. సెకండ్ బౌట్ లో ఇద్దరికి సమానంగా పాయింట్స్ వచ్చాయి. ముందునుంచి ప్రత్యర్థిపై పైచేయి సాధించిన నిఖత్ జరీన్ ప్రపంచ బ్యాక్సింగ్ చాంపియన్ గా నిలిచింది.

ఇందూరు నుంచి ఇంటర్నేషనల్ వరకు..

నిజామాబాద్ లో 1996 జూన్ 14 నిఖత్ జరీన్ జన్మించింది. తండ్రి జమీల్ అహ్మద్, తల్లి పర్వీన్ సుల్తానా. నిర్మలా హృదయ గర్ల్స్ హైస్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసిన నిఖత్..12 ఏళ్లకే బాక్సింగ్ లో అడుగుపెట్టింది. 2009 మామయ్య శంషుద్దీన్ దగ్గర బాక్సింగ్ పాఠాలు నేర్చుకుంది. నిఖత్ పట్టుదల, ఆసక్తిని గమనించిన ఆమె తండ్రి జమీల్ అహ్మద్...నిజామాబాద్ లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో శిక్షణ ఇప్పించాడు. రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించిన నిఖత్.. విశాఖ శాప్ శిక్షణకు ఎంపికైంది. అక్కడ ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐ. వెంకటేశ్వర్రావు శిక్షణలో రాటుదేలింది. ఇంటర్నేషనల్ బాక్సర్ గా ఎదిగింది. 

తొలి టోర్నీలోనే స్వర్ణం...ఆ తర్వాత పతకాల పంట..

2011లో టర్కీలో జరిగిన యూత్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ద్వారా అంతర్జాతీయ బాక్సింగ్ పోటీలకు అర్హత సాధించిన నిఖత్.... తొలిపోటీల్లోనే స్వర్ణం సాధించింది. అక్కడి నుంచి నిఖత్ జరీన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాతి ఏడాదే సెర్బియా ఇంటర్నేషనల్ ఉమెన్స్ బాక్సింగ్  టోర్నీలో సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. 2013లో యూత్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో వెండి పతకం దక్కించుకుంది. 2014లో గోల్డెన్ గ్లోవ్స్ టోర్నీలో పసిడి పతకాన్ని ముద్దాడింది. ఆ తర్వాత షిల్లాంగ్ లో జరిగిన సౌత్ ఏషియా బాక్సింగ్ టోర్నీలో అభిమాన బాక్సర్ మేరీకోమ్ తో హోరా హోరీగా తలపడి ఓడింది. అయినా కాంస్యాన్ని సాధించింది. 2016లో అస్సాంలో జరిగిన జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణాన్ని సాధించింది. 

భుజానికి గాయం..ఆటకు దూరం..

జాతీయ, అంతర్జాతీయ టోర్నీలో అదరగొడుతున్న నిఖత్ జరీన్ 2016లో గాయపడింది.  జాతీయ బాక్సింగ్ పోటీల్లో భుజానికి గాయం అవడంతో శస్త్రచికిత్స చేయించుకుంది. ఏడాది పాటు ఆటకు దూరమైంది. గాయం నుంచి కోలుకుని రెట్టించిన ఉత్సాహంతో రింగులోకి అడుగుపెట్టింది. 2019లో థాయిలాండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నీలో సిల్వర్ మెడల్ తో సత్తా చాటింది. అదే ఏడాది స్టాండ్జా మెమోరియల్ బాక్సింగ్ టోర్నీలో గోల్డ్ మెడల్ తో దుమ్మురేపింది. 

ప్లేస్ మారలేదు..పతకం మారలేదు..

తన బాక్సింగ్ కెరీర్ లో మొట్టమొదటి సారిగా 2011లో టర్కీలోనే జరిగిన ప్రపంచ జూనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో  50 కేజీల విభాగంలో నిఖత్‌ జరీన్‌ స్వర్ణ పతకం నెగ్గి విశ్వవిజేతగా నిలిచింది. సరిగ్గా 11 ఏళ్ల తర్వాత అదే గడ్డపై ప్రపంచ మహిళల బాక్సింగ్ టోర్నీలో ఛాంపియన్ గా నిలిచింది. 52 కేజీల విభాగంలో ఫైనల్లో థాయిలాండ్ ప్లేయర్ జుటమస్ టిట్పంగ్ పై గెలిచి స్వర్ణ పతకాన్ని సాధించింది. టర్నీ గడ్డపై భారత పతాకాన్ని రెపరెపలాడించింది.  మహిళల బాక్సింగ్ చరిత్రలో ఎవరికి సాధ్యం కానీ అరుదైన ఘనతను సాధించింది.  

ఒలింపిక్స్ లో దేశానికే పతకం అందించడమే టార్గెట్..

నిఖత్ జరీన్ కు బాక్సింగే ప్రపంచం. ప్రపంచంలోనే ఉత్తమ బాక్సర్ గా ఎదగడమే లక్ష్యంగా ఆమె ప్రయాణాన్ని సాగిస్తోంది. అటు ఒలింపిక్స్ లో భారత్ కు పతకం అందించడమే తన కల అంటోంది నిఖత్ జరీన్.  

మరిన్ని వార్తల కోసం...

రేపు ఉమ్మడి నల్గొండలో పవన్ కల్యాణ్ పర్యటన

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సమయంలో మార్పు