- ఇంటర్నల్ రోడ్లు వేయడమే కారణం
- పబ్లిక్ ట్రాన్స్ పోర్టు
- వినియోగించుకోవాలని సూచన
- తాజా నిర్ణయంతో విమర్శలు
హైదరాబాద్ సిటీ, వెలుగు : ‘నిమ్స్ హాస్పిటల్ లో సీసీ రోడ్లు వేస్తున్నాం. ఈ కారణంగా మూడు నెలల పాటు వాహనాలు పార్కింగ్ చేసుకోవడానికి ఉండదు. అందుకే రోగులు, వారి సహాయకులు, విజిటర్స్పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ (బస్సులు, రైళ్లు)మాత్రమే ఉపయోగించాలి’ అని నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. పంజాగుట్ట వైపు ఉన్న హాస్పిటల్ ఎంట్రెన్స్, ఎగ్జిట్, మిలీనియం, ఫిజియోథెరపీ బ్లాక్‌లు, డయాలసిస్ వెయిటింగ్ ఏరియా, వెల్నెస్ సెంటర్, ఎన్పీఆర్ బ్లాక్, యూనియన్ బ్యాంకు దగ్గరున్న స్టాఫ్ పార్కింగ్ ఏరియా, నర్సింగ్ హాస్టల్‌కు వెళ్లే దారి, డాక్టర్స్ క్లబ్ ఎదురుగా ఉన్న పార్కింగ్ ఏరియా, సీసీఎస్డీ, జనరల్ స్టోర్స్‌కు వెళ్లే రూట్‌తో పాటు సాధారణ పార్కింగ్ ఏరియాల్లో జీహెచ్ఎంసీ రోడ్లు వేస్తుందని తెలిపారు. పనులు కొనసాగేప్పుడు పార్కింగ్‌కు ఇబ్బందులు ఉంటాయని, అందుకే అత్యవసరమైతే తప్ప ప్రైవేట్ వెహికల్స్‌లో రావద్దని కోరారు.
రోజూ వేల సంఖ్యలో రోగులు
స్థానికంగా చూపించుకున్నా తగ్గనివారు, నాణ్యమైన వైద్యం అందుతుందని, తక్కువ ఖర్చులో అయిపోతుందని నిమ్స్దారి పడుతుంటారు. వీరు బస్సులు, రైళ్లలో జర్నీ చేయలేని స్థితిలో ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ప్రైవేట్ వెహికల్స్ లోనే వస్తారు. ఇకమీదట వీరు తిప్పలు పడక తప్పదు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వెహికల్లో వస్తే బయట ఎక్కడో జాగా చూసు కుని పార్క్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా రోజూ వేల సంఖ్యలో వచ్చే రోగులు, సహాయకులు, విజిటర్స్ కు పార్కింగ్ సమస్యలు ఎదుర్కోవలసిందే..
ఒక్కసారే ఎందుకు?
నిమ్స్‌లో ఇంటర్నల్ రోడ్లు వేయడానికి మూడు నెలల టైం పడుతుందన్న ప్రకటనపై విమర్శలు వస్తున్నాయి. పేషెంట్లకు, వారి బంధువుల వాహనాలకు పార్కింగ్ఇబ్బందులు తప్పించడానికి మరో మార్గం ఉన్నా అధికారులు తమకెందుకులే అన్నట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నగరంలో రద్దీగా ఉండే ప్రధాన రోడ్లనే ఒకటి, రెండు రోజుల్లో వేస్తుంటే..నిమ్స్ లో మూడు నెలలు తీసుకోవడం ఏంటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
అన్ని రోడ్లను ఒక్కసారి మొదలుపెట్టే బదులు ఇబ్బందులు లేని చోట ముందు మొదలుపెట్టి.. పార్కింగ్‌ను కొనసాగించాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే, గతంలో నిమ్స్ లో పార్కింగ్ ఫీజు తీసుకునేవారని, హైకోర్టు ఆదేశాలతో ఫ్రీ పార్కింగ్ విధానం కొనసాగుతోందని, దీన్ని కొనసాగించడం ఇష్టం లేకే రోడ్ల ప్రతిపాదనతో పార్కింగ్‌కు బ్రేక్ వేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
