నిమ్స్‌‌‌‌ లో రిఫండ్‌‌‌‌ పైసల్ ఇస్తలే!

నిమ్స్‌‌‌‌ లో రిఫండ్‌‌‌‌ పైసల్ ఇస్తలే!
  •     ఏడాది దాటినా అకౌంట్లలో పడని డబ్బులు

హైదరాబాద్, వెలుగు: పేదోడి కార్పొరేట్ హాస్పిటల్‌‌‌‌ గా పేరున్న నిమ్స్‌‌‌‌ లో.. ఆ పేదోడి సొమ్ముకే గ్యారంటీ లేకుండా పోతోంది. ప్రాణం కాపాడుకునేందుకు అప్పుసప్పు చేసి తెచ్చిన డబ్బుల్లో చికిత్స పోగా మిగిలిన సొమ్మును వెనక్కి ఇచ్చేందుకు హాస్పిటల్ అధికారులు పేషెంట్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. అడ్మిషన్ సమయంలో అడ్వాన్సుల రూపంలో వసూలు చేస్తున్న అధికారులు.. రిఫండ్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం కొర్రీలు పెడుతున్నారు. 

బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ కార్డులు, బిల్లులు, లెటర్లు అంటూ సవాలక్ష కండిషన్లు పెడుతూ.. జనాలను ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటున్నారు. నిమ్స్ అధికారుల తీరుతో విసిగిపోతున్న వందల మంది పేషెంట్లు తమ డబ్బులను వదిలేసుకుని పోతున్నరు.

సవాలక్ష కండిషన్లు

నిమ్స్‌‌‌‌ లో అడ్మిట్ అయ్యేటప్పుడు అడ్వాన్సు కింద డబ్బులు కట్టించుకుంటారు. ట్రీట్మెంట్ అయిపోయాక.. బిల్లు కట్ చేసుకుని మిగతా డబ్బులు పేషెంట్‌‌‌‌కు ఇవ్వాలి. ఇది సాధారణ పద్ధతి. కానీ నిమ్స్‌‌‌‌లో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోంది. డిశ్చార్జ్ అయ్యే సమయంలో చేతిలో చిల్లిగవ్వ లేక పేషెంట్లు ఇబ్బంది పడుతుంటే.. మిగిలిన డబ్బులు చేతికి ఇవ్వకుండా అకౌంట్‌‌‌‌లో వేస్తామని చెప్తున్నారు. దానికి బ్యాంక్ పాస్ బుక్, ఆధార్ జిరాక్స్, ఒరిజినల్ బిల్లులు, అప్లికేషన్ లెటర్ అంటూ నిబంధనలు పెట్టారు.  అవన్నీ ఇచ్చినా.. నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూనే ఉన్నారే తప్ప పైసా విదిల్చడం లేదు.

బ్యాంకు పాస్ బుక్ వెంట తెచ్చుకుంటారా?

ఎమర్జెన్సీలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చే జనం.. వెంట బ్యాంకు పాస్ బుక్కులు తెచ్చుకుంటారా అని అడిగితే.. వివరాలు లేకుంటే మళ్లీ ఎప్పుడైనా వచ్చి అప్లికేషన్ రాసివ్వండని నిమ్స్ అధికారులు ఉచిత సలహాలు ఇస్తున్నారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పేషెంట్లు.. ఆ రీఫండ్ కోసం మళ్లీ చార్జీలు పెట్టుకుని రాలేక తమ డబ్బులు వదులుకుంటున్నారు. 

టెక్నాలజీ ఇంత పెరిగినా ఇంకా పాత పద్ధతులతో జనాన్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిటీలోని ఇతర ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఎప్పటికప్పుడు అకౌంట్స్ సెటిల్ చేస్తుంటే.. అక్కడలేని సమస్య నిమ్స్‌‌‌‌లోనే ఎందుకు వస్తోందని పేషెంట్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్యను పరిష్కరించాలని, రిఫండ్ అమౌంట్ అంతా క్లియర్ చేయాలని కోరుతున్నారు.

ఏడాది దాటినా పడని పైసలు..

ఖమ్మం జిల్లాకు చెందిన ఓ బాధితురాలు 2024 సెప్టెంబర్‌‌‌‌లో నిమ్స్‌‌‌‌ లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఖర్చులు పోగా ఇంకా రూ. 15 వేలు రిఫండ్ రావాల్సి ఉంది. అధికారులు అడిగినట్లే బ్యాంక్ అకౌంట్, ఆధార్, బిల్లుల జిరాక్సులు జతచేసి లెటర్ రాసిచ్చారు. వారం రోజుల్లో పడతాయన్న డబ్బులు.. ఏడాది గడిచినా రాలేదు. ఆమె కుమారుడు సంబంధిత అధికారులను నాలుగైదు సార్లు కలిశారు. అధికారులు రేపు మాపు అని చెప్పారు. లాభం లేక ఏకంగా నిమ్స్ డైరెక్టర్‌‌‌‌నే కలిసి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది.

బస్ కిరాయికి పైసల్ లేక..

సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన తండ్రికి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం నిమ్స్‌‌‌‌కు వచ్చాడు. డిశ్చార్జ్ అయ్యాక బ్యాలెన్స్ అమౌంట్ కోసం వెళ్తే..  బ్యాంక్ పాస్ బుక్ లేకపోవడంతో నిమ్స్ అధికారులు డబ్బులు ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు. ఊరికి వెళ్లి మళ్లీ హైదరాబాద్ వచ్చి ఆ డబ్బులు తీసుకునే స్తోమత, ఓపిక లేక తన బ్యాలెన్స్ అమౌంట్‌‌‌‌ను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఆరోజు  తన తండ్రిని ఇంటికి తీసుకపోవడానికి బస్ కిరాయి కోసం చేతిలో రూపాయి లేదని, బంధుల వద్ద అప్పుచేసి ఇంటికి తీసుకుపోవాల్సిన పరిస్థితి అని బాధితుడు వాపోయాడు.