కుప్పకూలిన విమానం.. తొమ్మిది మంది మృతి

కుప్పకూలిన విమానం.. తొమ్మిది మంది మృతి

కరేబియన్‌ దీవుల్లోని డొమినికన్‌ రిపబ్లిక్‌లో విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 9 మంది ప్రాణాలను కొల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. శాంటో డొమింగోలో.. ఒక ప్రైవేటు విమానం లా ఇసబెల్లా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఫ్లోరిడా వెళ్తుండగా ఈ  ప్రమాదం చోటు చేసుకుంది. విమానం ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో చనిపోయిన వారిలో  ప్రముఖ ప్యూర్టోరికన్‌ సంగీత నిర్మాత జోస్‌ ఏంజెల్‌ హెర్నాండెజ్‌ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఆయన 'ఫ్లోలా మూవీ, టె బోటే'వంటి హిట్‌ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. హెర్నాండెజ్‌ 38 ఏళ్లకే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. మృతి చెందిన వారిలో అమెరికాకు చెందిన ఆరుగురు, డొమినికన్‌ రిపబ్లిక్‌ నుంచి ఇద్దరు, వెనిజులాకు చెందిన మరో ప్రయాణికుడు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.  ప్రమాదం ఎలా జరిగింది? ఏమైందన్న విషయాలు ఇంకా తెలియలేదన్నారు. విమాన ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.