పంట నష్టపోయిన..రైతులను ఆదుకోవాలె : మంత్రి నిరంజన్‌‌‌‌ రెడ్డి

పంట నష్టపోయిన..రైతులను ఆదుకోవాలె : మంత్రి నిరంజన్‌‌‌‌ రెడ్డి
  • ఎకరానికి రూ.10 వేల పరిహారం చెల్లించాలి
  • మాజీ మంత్రి నిరంజన్‌‌‌‌ రెడ్డి డిమాండ్

హైదరాబాద్, వెలుగు :  రాళ్ల వాన, నీటి ఎద్దడితో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని బీఆర్​ఎస్​ నేత, మాజీ మంత్రి నిరంజన్‌‌‌‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎకరానికి కనీసం రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. బుధవారం తెలంగాణ భవన్‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓవైపు సాగుకు నీళ్లు ఇవ్వక కాంగ్రెస్ ప్రభుత్వం పంటలను ఎండవెడుతుంటే, మరోవైపు వడగళ్ల వానతో పంటలు నాశనం అవుతున్నాయని నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  రైతు బంధు కూడా ఇంకా పూర్తిగా అందలేదని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ వందరోజుల్లోనే వ్యవసాయాన్ని అతలాకుతలం చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వాన్ని దోషిగా చూపించేందుకు, రైతులను ముంచుతున్నారని చెప్పారు.  

ఇకనైనా ఆలోచించుకోవాలి

 రైతులు ఏ ప్రభావానికిలోనై  కాంగ్రెస్‌‌‌‌కు ఓటేశారో ఇకనైనా ఆలోచించుకోవాలని నిరంజన్‌‌‌‌ రెడ్డి అన్నా రు. అడ్డగోలుగా అప్పులు చేస్తున్నారని తమ ప్రభుత్వంపై నిందలు వేసిన కాంగ్రెస్‌‌‌‌.. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రూ.16,400 కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. రైతులకు ఇవ్వడానికి పైసలు లేవని చెబుతున్న ప్రభుత్వం, గుత్తేదార్లకు మాత్రం బిల్లులు చెల్లిస్తోందని విమర్శించారు.