నీరవ్ మోడీ అప్పీల్ కు నో చెప్పిన లండన్ హైకోర్టు

నీరవ్ మోడీ అప్పీల్ కు నో చెప్పిన లండన్ హైకోర్టు

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రుణాలు ఎగ్గొట్టిన కేసులో నీరవ్ మోడీని భారత్ కు అప్పగించేందుకు మార్గం మరింత సులువైంది. భారత్ కు అప్పగించాలన్న లండన్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. యూకే సుప్రీంకోర్టు తలుపు తట్టాలన్న నీరవ్ ప్రయత్నానికి చుక్కెదురైంది. తాజా తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ నీరవ్ మోడీ చేసిన అభ్యర్థనను లండన్ హైకోర్టు ఇవాళ తిరస్కరించింది.  తనను భారత్‌కు అప్పగిస్తే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తాయని నీరవ్ మోడీ వాదించారు. ఈ వాదనలతో తాము ఏకీభవించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టపరమైన ఖర్చుల కింద రూ.1.5 కోట్లు చెల్లించాలని నీరవ్‌ను ఆదేశించింది.

2019 మార్చిలో అరెస్టయిన నీరవ్ ప్రస్తుతం లండన్ జైలులో ఉన్నారు. 2018లో దేశం నుంచి పారిపోయిన నీరవ్ మోడీని తిరిగి దేశానికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. లండన్ హైకోర్టు తీర్పును భారత విదేశీ వ్యవహారాల శాఖ స్వాగతించింది. త్వరగా నీరవ్ మోడీని తమకు అప్పగించాలని బ్రిటన్ సర్కార్ ను కోరింది. 

తనను భారత్ కు అప్పగించొద్దంటూ గత నెలలోనూ నీరవ్ చేసిన ఓ అభ్యర్థనను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పుడు ఆయనకు ఉన్న ఏకైక మార్గం యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌ను ఆశ్రయించడమే. కాగా, ఆంటిగ్వా అండ్ బార్బుడా పౌరసత్వం తీసుకున్న నీరవ్ మోదీ మేనమామ మెహుల్ చోక్సీ కూడా ఇదే కేసులో నిందితుడిగా ఉన్నారు.