లండన్/న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి బ్రిటన్ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. తనను భారత్‌కు అప్పగించాలన్న గత ఉత్తర్వులపై విచారణను మళ్లీ ప్రారంభించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను లండన్‌లోని హైకోర్ట్ ఆఫ్ జస్టిస్ బుధవారం తిరస్కరించింది.
ఈ మేరకు జస్టిస్ జెరెమీ స్టువర్ట్-స్మిత్, జస్టిస్ రాబర్ట్ జేలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. రక్షణ రంగ దళారీ సంజయ్ భండారీకి సంబంధించిన గత కోర్టు తీర్పును ఆధారం చేసుకుని నీరవ్ మోదీ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
తనను భారత్‌కు అప్పగిస్తే అక్కడ జైళ్లలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, విచారణ సంస్థల నుంచి వేధింపులు ఉంటాయని నీరవ్ వాదించారు. భారత ప్రభుత్వం తరఫున సీబీఐ బృందం, బ్రిటన్ విచారణ సంస్థలు ఈ వాదనలను తిప్పికొట్టాయి.
