నీరవ్ మోడీ అప్పగింతకు యూకే గ్రీన్ సిగ్నల్

నీరవ్ మోడీ అప్పగింతకు యూకే గ్రీన్ సిగ్నల్

పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంలో కీలక సూత్రధారి నీరవ్ మోడీ అప్పగింతకు యూకే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.14,000 కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన నీరవ్ మోడీని ఎట్టకేలకు భారత్‌కు అప్పగించేందుకు ఆమోదం తెలుపుతూ యూకే హోం సెక్రటరీ ప్రీతి పటేల్ ఉత్తర్వులు జారీచేశారు. నీరవ్ మోడీ 2018లో దేశం నుంచి పరారయ్యారు. 

బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్‌లో ఉంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని భారత్ తీసుకొచ్చేందుకు దాదాపు లైన్ క్లియర్ అయినట్లే. ఈ విషయాన్ని CBI వర్గాలు వెల్లడించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్‌లో నీరవ్ మోడీ కీలక దోషి. ఆయన పారిపోయిన తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. నీరవ్ మోడీ, అతని మేనమామ మెహుల్ చోక్సీ మరియు వారి పార్టనర్స్ కలిసి చేసిన మొత్తం బ్యాంక్ ఫ్రాడ్ 28వేల కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. నీరవ్ మోడీ 2018 నుంచి దుబాయ్‌లో, ఆ తర్వాత లండన్‌‌లో సెటిలయ్యాడు. అతడిని తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం లండన్ కోర్టులో పిటిషన్ వేసింది. 2019 ఫిబ్రవరిలో నీరవ్ మోడీని అప్పగించే సమయంలో ఆయన తరపు న్యాయవాది మళ్లీ కోర్టును ఆశ్రయించాడు. ‘మా క్లయింట్‌కి ఎలుకలంటే భయం. భారత్‌కు అప్పగిస్తే.. ఆయన్ని తీసుకెళ్లి ముంబైలోని ఆర్థర్ జైల్లో ఉంచుతారు. అసలే ఆ జైల్లో ఎలుకలు, క్రిమికీటకాలు ఎక్కువగా ఉన్నాయి. సుచీ సుబ్రతా అసలే ఉండదు. ఎక్కడ చూసినా మురుగు నీటి కాల్వలు ఉంటాయి. అటువంటి జైల్లో మా క్లయింట్‌ను ఉంచడం మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందంటూ నీరవ్ మోడీ లాయర్లు భారత్‌కు చెందిన న్యాయవాదులతో వాదించారు. దాంతో ఆయన అప్పగింత మరోసారి వాయిదాపడింది. ఇప్పుడు నీరవ్ అప్పగింతకు మార్గం సుగమమైంది. భారత్ వేసిన పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు ఆయనను త్వరలోనే అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.