
- ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు రిలీజ్ చేసిన కేంద్రం
- ఓవరాల్ కేటగిరీలో ఓయూకు 53,
- వర్సిటీ విభాగంలో 30వ ర్యాంకు
- ఇంజనీరింగ్ కేటగిరీలో 6 స్థానాలు దిగజారి జేఎన్టీయూకు 94వ ర్యాంకు
- ఓవరాల్ కేటగిరీలో రాష్ట్రం నుంచి 6 విద్యా సంస్థలకు చోటు
- నేషనల్ లెవెల్లో ఐఐటీ మద్రాస్ టాప్
హైదరాబాద్, వెలుగు: దేశంలోని విద్యాసంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకుల్లో తెలంగాణ విద్యా సంస్థలు సత్తా చాటాయి. గత మూడేండ్ల నుంచి ఓయూ ర్యాంకు దిగజారగా.. ఈ ఏడాది మాత్రం వివిధ కేటగిరీల్లో మంచి ర్యాంకులు సాధించింది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా రాష్ట్రంలోని వివిధ జాతీయ విద్యాసంస్థలు టాప్‌లోనే నిలిచాయి. గురువారం ఎన్ఐఆర్ఎఫ్–2025 ర్యాంకులను కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. దేశంలోని విద్యాసంస్థల్లో టీచింగ్ లర్నింగ్ అండ్ రీసోర్సెస్, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్, గ్రాడ్యుయేషన్ ఔట్ కమ్స్, అవుట్ రీచ్ అండ్ ఇన్ క్లూజివిటీ, పీర్ పర్స్పెక్షన్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని 17 కేటగిరీల్లో ర్యాంకులు కేటాయించింది.
ఓవరాల్ కేటగిరీ, యూనివర్సిటీలు, కాలేజీలు, రీసెర్చ్ ఇనిస్టిట్యూషన్స్, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, మెడికల్, డెంటల్, లా, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, అగ్రికల్చర్ అండ్ అలియేడ్ సెక్టార్స్, ఇన్నోవేషన్, స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్, ఓపెన్ వర్సిటీస్, స్కిల్ యూనివర్సిటీస్ తదితర కేటగిరీలతో పాటు కొత్తగా సస్టెనేబుల్ డెవలప్ మెంట్ గోల్స్ కేటగిరీని కొత్తగా ప్రకటించింది. ఈ కేటగిరీల్లో పలు విద్యాసంస్థలకు ర్యాంకులు అలాట్ చేసింది. ఒవరాల్ కేటగిరీలో ఐఐటీ గతంలో మాదిరిగానే 12వ స్థానాన్ని నిలబెట్టుకోగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గతంలో పోలిస్తే ఒక ర్యాంకు పెరిగి 26కు, ఓయూ 17 స్థానాలు ఎగబాకి 53వ ర్యాంకు, వరంగల్ నిట్ 10 స్థానాలు దిగజారి 63వ స్థానానికి పడిపోయింది. ఫస్ట్ టైమ్ ఐఐఐహెచ్ 89వ ర్యాంకు పొంది.. టాప్ 100లో చోటు సంపాదించుకున్నది.
ఓవరాల్ కేటగిరీలో నిరుడు ఓయూకు 70వ ర్యాంకు
ఇంజనీరింగ్ కేటగిరీలో 6 విద్యాసంస్థలు చోటు సాధించాయి. ఐఐటీహెచ్ 7, నిట్ 28, ఐఐఐటీహెచ్ 38, హెచ్‌సీయూ 74, ఎస్ఆర్ వర్సిటీ 91, జేఎన్టీయూహెచ్ 94వ ర్యాంకులు సాధించాయి. యూనివర్సిటీ కేటగిరీలో టాప్ 100లో హెచ్‌సీయూ 18, ఓయూ 30, ఐఐఐటీ 55, జేఎన్టీయూ 81వ ర్యాంకును సాధించాయి. చాలా ఏండ్ల తర్వాత ఓయూ.. మెరుగైన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకు సాధించింది. ఓవరల్ కేటగిరీలో గతేడాది 70వ స్థానంలో ఉండగా, ఈసారి 53వ ర్యాంకును సొంతం చేసుకున్నది. మరోపక్క యూనివర్సిటీ కేటగిరీలో గతేడాది 43వ స్థానం ఉండగా.. ఈ ఏడాది 30వ ర్యాంకు లభించింది. స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ కేటగిరీలో నిరుడు 6వ స్థానంలో ఉండగా.. ఈ సారి 7వ ర్యాంకు సాధించింది. అయితే, ఇంజనీరింగ్ కేటగిరీలో జేఎన్టీయూ ర్యాంకు పడిపోయింది. గతేడాది 88వ స్థానంలో ఉంటే.. ఈ ఏడాది 94కు పడిపోయింది.
ఫార్మసీ కేటగిరీలో క్రమంగా దిగజారుతున్న నైపర్
మెడికల్ కేటగిరీలో ఓయూ మెడికల్ కాలేజీకి గతేడాది ఉన్న 48వ ర్యాంకుతోనే సరిపెట్టుకున్నది. ఫార్మసీ కేటగిరీలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ హైదరాబాద్ (నైపర్) వరుసగా రెండో ఏడాది కూడా ర్యాంకు దిగజారింది. మూడేండ్ల కింద టాప్‌లో ఉండగా, నిరుడు 2వ స్థానంలో ఈసారి ఐదో స్థానానికి పడిపోయింది. ఇదే కేటగిరీలో అనురాగ్ వర్సిటీ 72వ స్థానంలో నిలిచింది. లా కేటగిరీలో నల్సార్ లా వర్సిటీ నిరుడు మాదిరిగానే ఈసారి కూడా మూడో ర్యాంకు సాధించింది. అగ్రికల్చర్ కేటగిరీలో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ 24వ ర్యాంకు, మేనేజ్మెంట్ కేటగిరీలో ఇఫ్కాయి విద్యాసంస్థలు 46, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీలో 72, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ 95, ఇన్నోవేషన్ కేటగిరీలో ఐఐటీహెచ్ 6వ ర్యాంకులో నిలిచాయి.
అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్
దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్ నిలిచింది. ఓవరాల్ కేటగిరీలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నది. వరుసగా పదోసారి ఇంజనీరింగ్ విభాగంలోనూ నంబర్ వన్ గా నిలిచి రికార్డు సృష్టించింది. నిరుడు రెండో స్థానంలో ఉన్న ఇన్నొవేషన్స్ కేటగిరీలో ఈసారి నంబర్ వన్ ర్యాంక్ సాధించింది. తాజాగా ప్రవేశపెట్టిన సస్టెనేబుల్ డెవలప్ మెంట్ గోల్స్ కేటగిరీలోనూ అగ్ర స్థానాన్ని దక్కించుకున్నది. యూనివర్సిటీల విభాగంలో బెంగళూరు ఐఐటీ టాప్‌లో ఉంది. ఢిల్లీలోని జవహరల్ లాల్ నెహ్రూ వర్సిటీ 2వ స్థానంలో ఉంది. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ మూడో స్థానంలో నిలిచింది. ఇక కాలేజీల విషయానికొస్తే.. ఢిల్లీ హిందూ కాలేజీ టాప్ ప్లేస్ దక్కించుకున్నది. సార్వత్రిక విశ్వవిద్యాలయాల విభాగంలో ఇందిరాగాంధీ ఓపెన్ వర్సిటీ టాప్ లో ఉంది. రెండో స్థానంలో కర్నాటక రాష్ట్రసార్వత్రిక వర్సిటీ నిలిచింది.