మత్తు ఇంజక్షన్‌‌‌‌ అమ్ముతున్న ముఠా అరెస్ట్‌‌‌‌

మత్తు ఇంజక్షన్‌‌‌‌ అమ్ముతున్న ముఠా అరెస్ట్‌‌‌‌
  • పట్టుబడిన వారంతా ల్యాబ్‌‌‌‌ టెక్నీషియన్సే..

నిర్మల్, వెలుగు : యువకులను లక్ష్యంగా చేసుకొని మత్తు ఇంజక్షన్లు అమ్ముతున్న ముఠాను నిర్మల్‌‌‌‌ పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ జానకీ షర్మిల వెల్లడించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ల్యాబ్‌‌‌‌ టెక్నీషియన్స్‌‌‌‌ షేక్‌‌‌‌ ఫర్దీన్‌‌‌‌, చవాన్‌‌‌‌ గోవింద్, మహ్మద్‌‌‌‌ అబ్దుల్‌‌‌‌ డానిశ్‌‌‌‌తో పాటు మహ్మద్‌‌‌‌ పర్వేజ్‌‌‌‌ అనే స్టూడెంట్‌‌‌‌ ముఠాగా ఏర్పడ్డారు. ఈజీగా డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో యువతను టార్గెట్‌‌‌‌గా చేసుకొని మత్తుమందు అమ్మేందుకు ప్లాన్‌‌‌‌ చేశారు.

ఇందులో భాగంగా హాస్పిటల్స్‌‌‌‌లో మత్తు ఇచ్చేందుకు ఉపయోగించే ఓ ఇంజక్షన్‌‌‌‌ను ఎలా వినియోగించాలో యూట్యూబ్‌‌‌‌ ద్వారా తెలుసుకున్నారు. తర్వాత గంజాయికి అలవాటు పడిన యువకులను గుర్తించి వారికి ఆ ఇంజక్షన్లు అలవాటు చేశారు. ఒక్కో ఇంజక్షన్‌‌‌‌కు రూ. 500 చొప్పున వసూలు చేస్తూ ఏడాది కాలంగా దందా కొనసాగిస్తున్నారు.

విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు అడిషనల్‌‌‌‌ ఎస్పీ రాజేశ్‌‌‌‌మీనా, టౌన్‌‌‌‌ సీఐ ప్రవీణ్‌‌‌‌కుమార్‌‌‌‌, సిబ్బందితో టీమ్‌‌‌‌ను ఏర్పాటు చేశారు. పట్టణంలోని బైల్‌‌‌‌ బజార్‌‌‌‌ వద్ద ఇంజక్షన్లు అమ్ముతున్నట్లు తెలుసుకొని గురువారం దాడి చేసి నలుగురిని అరెస్ట్‌‌‌‌ చేశారు. వారి వద్ద నుంచి 26 ఇంజక్షన్లు, సిరంజీలు, నాలుగు సెల్‌‌‌‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.