తెలంగాణ న్యాయవాదికి అరుదైన గౌరవం

తెలంగాణ న్యాయవాదికి అరుదైన గౌరవం

ఢిల్లీ : తెలంగాణకు చెందిన సీనియర్ అడ్వకేట్ పి. నిరూప్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయనను సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ గా సర్వోన్నత న్యాయస్థానం నియమించింది.  డిసెంబర్ 8న  ఫుల్ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.  తెలంగాణ నుంచి సుప్రీంకోర్టు ఎంపిక చేసిన మొట్ట మొదటి సీనియర్ అడ్వకేట్ నిరూప్ కావడం విశేషం.  మాజీ మంత్రి పి. రామచంద్రారెడ్డి కుమారుడైన నిరూప్ 30ఏళ్లుగా సుప్రీంకోర్టులో సేవలందిస్తున్నారు. తన వాదన పటిమతో కెరీర్లో ఆయన ఎన్నో విజయాలు సాధించారు. 31 జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేసుల్లో తీర్పులు నివేదించారు. ముఖ్యంగా ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా, ఎన్విరాన్ మెంటల్ లా, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లా, ల్యాండ్ అండ్ అగ్రికల్చర్ లా, కాన్ స్టిట్యూషనల్ లా కు సంబంధించి వాదించిన కేసుల్లో వచ్చిన తీర్పులు నిరూప్ కెరియర్ లో మైలురాయిగా నిలిచాయి. సోలీ సోరాబ్జీ, ఫాలి ఎస్ నారిమన్, రోహింటన్, కె. పరాశరణ్, పి.చిదంబరం తదితర సీనియర్ అడ్వకేట్లతో కలిసి నిరూప్ పనిచేశారు. 

అడిషనల్ సొలిసిటర్-జనరల్ ఆఫ్ ఇండియా వీ ఆర్ రెడ్డి, మాజీ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గోపాల్ సుబ్రమణ్యం వద్ద నిరూప్ సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు. 2013 -16 మధ్య సుప్రీంకోర్టులో గోవా, ఢిల్లీ ఫోరంలకు సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా పనిచేశారు. ఢిల్లీ, మేఘాలయ రాష్ట్రాలకు అదనపు అడ్వకేట్ జనరల్ గా కూడా పనిచేశారు. న్యాయవాదిగా తండ్రి వారసత్వం కొనసాగిస్తూ నిరూప్ మెదక్ ముఫిసిల్ కోర్టు నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ సుప్రీంకోర్టు వరకు సుదీర్ఘ ప్రయాణం సాగించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం తరఫున వాదనలు వినిపించేందుకు స్థానిక సీనియర్ అడ్వకేట్లు ఎవరూ లేరు. తాజాగా నిరూప్ నియామకంతో ఆ సమస్య తీరనుంది.