జేడీయూలో చేరిన సీఎం నితీష్ కుమార్ కొడుకు.. డిప్యూటీ సీఎం పోస్ట్ ఫిక్స్..!

జేడీయూలో చేరిన సీఎం నితీష్ కుమార్ కొడుకు.. డిప్యూటీ సీఎం పోస్ట్ ఫిక్స్..!

పాట్నా: బీహార్‎లో పొలిటికల్ ఈక్వేషన్స్ శరవేగంగా మారుతున్నాయి. ఇటీవలే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆకస్మాత్తుగా రాజ్య సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే.. తాజాగా సీఎం నితీష్ కుమార్ కొడుకు నిశాంత్ కుమార్ పొలిటికల్ అరంగ్రేటం చేశాడు.

నిశాంత్ కుమార్ తన తండ్రి నితీష్ ప్రాతినిధ్యం వహిస్తోన్న జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) పార్టీలో చేరారు. ఆదివారం (మార్చి 8) పాట్నాలోని జేడీయూ పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లాలన్,  జేడీయూ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా సమక్షంలో జేడీయూ తీర్థం పుచ్చుకున్నారు. 

పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తా: నిశాంత్ 

జేడీయూలో చేరిక అనంతరం నిశాంత్ కుమార్ మాట్లాడారు. జేడీయూని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తన తండ్రి, సీఎం నితీష్ కుమార్ రాజ్య సభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని.. అది పూర్తిగా ఆయన వ్యక్తిగత నిర్ణయమన్నారు. మేం అందరం ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తామని పేర్కొన్నారు.

 తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని.. ఆయన మార్గదర్శకత్వంలో పని చేస్తానని చెప్పారు. బీహార్‌కు అత్యంత ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన తన తండ్రి గత ఇరవై ఏళ్లలో రాష్ట్రానికి ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు. బీహార్ అభివృద్ధికి ఆయన చేసిన సేవ, సహకారాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని అన్నారు.

డిప్యూటీ సీఎంగా నిశాంత్ కుమార్..?

దాదాపు 20 ఏండ్లుగా బీహార్‎లో అధికారం చెలాయిస్తోన్న నితీష్ కుమార్ ఉన్నఫళంగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బీహార్ నుంచి రాజ్య సభ స్థానానికి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. బీహార్‎లో ఎన్డీఏ సర్కార్‎కు పూర్తి మెజార్టీ ఉండటంతో నితీష్ కుమార్ రాజ్య సభ సభ్యుడిగా ఎన్నిక కావడం లాంఛనమే. దీంతో త్వరలోనే నితీష్ కుమార్ బీహార్ సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు.

గత కొన్నేండ్లుగా బీహార్‏లో అతిపెద్ద పార్టీగా అవతరిస్తున్నప్పటికీ కావాల్సిన మెజార్టీ లేకపోవడంతో బీజేపీ సీఎం పదవి చేపట్టలేకపోతుంది. 2025లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ 88 స్థానాల్లో విజయ ఢంకా మోగించి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవతరించింది. కానీ పొత్తులో భాగంగా జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 

అయితే.. నితీష్ కుమార్ రాజ్య సభకు వెళ్తుండటంతో ఈసారి సీఎం పగ్గాలు చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. ఈసారి బీజేపీ వ్యక్తే బీహార్ సీఎం పగ్గాలు చేపడతారని ఆ రాష్ట్ర రాజకీయాల్లో కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే నితీష్ కుమార్ కొడుకు నిశాంత్ కుమార్‎కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 నిశాంత్ కుమార్‎ వచ్చే నెలలో ఎమెల్సీగా ఎన్నిక అవుతారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే నిశాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి జేడీయూలో జాయిన్ అయ్యారు. కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసమే నితీష్ కుమార్ తన పదవిని త్యాగం చేశారని కూడా ప్రచారం జరుగుతోంది.