ఓరుగల్లు అభివృద్ధి పనులకు ఎన్‍ఐటీ టెక్నాలజీ

ఓరుగల్లు అభివృద్ధి పనులకు ఎన్‍ఐటీ టెక్నాలజీ

 

  • నగర డెవలప్​మెంట్​కు ముందుకొచ్చిన బృందం
  • జీడబ్ల్యూఎంసీ, ఎన్‍ఐటీ మధ్య కుదిరిన ఎంవోయూ
  • సిటీని డ్రోన్‍ సర్వే, త్రీడీ మ్యాపింగ్‍ చేసేలా అడుగులు 
  • సుస్థిర పట్టణాభివృద్ధిపై జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లకు త్వరలో ట్రైనింగ్‍ 

వరంగల్‍, వెలుగు:  ఓరుగల్లు అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు వరంగల్‍ ఎన్‍ఐటీ (నేషనల్‍ ఇనిస్టిట్యూట్‍ ఆఫ్‍ టెక్నాలజీ) ముందుకొచ్చింది. గ్రేటర్ వరంగల్‍తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలు భారీ ప్రాజెక్టులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, నాణ్యతతో కూడిన అభివృద్ధికి సహకరించనుంది. ఈ మేరకు జీడబ్యూఎంసీ స్పెషల్‍ ఆఫీసర్‍, కలెక్టర్‍ చాహత్‍ బాజ్‍పాయ్‍, బల్దియా కమిషనర్‍ టి.వెంకన్న, ఎన్‍ఐటీ డైరెక్టర్‍ ప్రొఫెసర్‍ బిద్యాధర్‍ సుబూది, డిప్యూటీ డైరెక్టర్‍ రతీశ్​కుమార్‍, సివిల్‍ ఇంజినీరింగ్‍ ప్రొఫెసర్లు ఎస్‍.శంకర్‍, శశి బృందం ఇటీవల అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

గ్రేటర్ వరంగల్‍కు భారీ ప్రాజెక్టులు 

గ్రేటర్‍ వరంగల్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ పలు భారీ ప్రాజెక్టులు కేటాయించింది. కేంద్రం సహకారంతో మరిన్ని భారీ ప్రాజెక్టులు చేపడుతోంది. ఇందులో కాజీపేట రైల్వే కోచ్‍ ఫ్యాక్టరీ, మామునూరు ఎయిర్‍పోర్ట్, కాకతీయ మెగా టెక్స్​టైల్‍ పార్క్, సూపర్‍ స్పెషాలిటీ హాస్పిటల్, ఇన్నర్‍, ఔటర్​ రింగ్‍ రోడ్లు, నేషనల్‍ హైవేలతోపాటు రూ.5,257 కోట్లతో అండర్‍గ్రౌండ్‍ డ్రైనేజీ పనులు చేపట్టనున్నారు. మరో రూ.551 కోట్లతో తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు సిద్ధమవుతున్నారు. భద్రకాళి బండ్‍, భద్రకాళి చెరువు బ్యూటిఫికేషన్‍ పనులు సాగుతుండగా, ఐటీ టవర్లు రానున్నాయి. 

గ్రేటర్​ను వేధిస్తున్న సమస్యలు.. 

గ్రేటర్‍ వరంగల్‍ కు భారీ ప్రాజెక్టులు వస్తున్నప్పటికీ వరంగల్​ ట్రైసిటీని వరద ముంపు, నాలాల ఆక్రమణలు, తాగునీటి పైపులైన్ల లీకేజీలు, పార్కింగ్​ కొరత, ట్రాఫిక్​ సమస్యలు వేధిస్తున్నాయి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపడమే లక్ష్యంగా ఎన్‌‌ఐటీ నిపుణుల సహకారం తీసుకోనున్నారు.

విజన్‍ 2057కు ఎన్‍ఐటీ సాంకేతికత 

గ్రేటర్ వరంగల్‍ 2057 జనాభాకు అనుగుణంగా సుస్థిర పట్టణాభివృద్ధి, స్మార్ట్​ సిటీ ప్రణాళిక, ఘన వ్యర్థాల నిర్వహణ, పర్యావరణహిత అభివృద్ధికి ఎన్‍ఐటీ సాంకేతిక సహకారం అందించనుంది. జీడబ్ల్యూఎంసీ ఇంజినీర్లు, ఆఫీసర్లకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి ప్రోగ్రామ్​లు కూడా నిర్వహించనున్నారు.  

డ్రోన్‍ సర్వే, త్రీడీ మ్యాపింగ్‍..

మొదట వరంగల్​ ట్రైసిటీపై డ్రోన్‍ సర్వే నిర్వహించి త్రీడీ మ్యాపింగ్‍ ద్వారా నగరానికి డిజిటల్ రూపం ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా భవనాలు, ఖాళీ స్థలాలు, మైదానాల విస్తీర్ణాన్ని గుర్తించి ఆస్తిపన్ను పరిధిలోకి రాని ఆస్తుల వివరాలను సేకరించనున్నారు. అలాగే నాలాల హద్దులు, బఫర్‍ జోన్లు, ఆక్రమణలను గుర్తించి వరద ముంపు నివారణకు ప్రణాళికలు రూపొందిస్తారు. రోడ్లు, డ్రైనేజీ, భూగర్భ పైపులైన్లు, తాగునీటి సరఫరా, ట్రాఫిక్‍ రద్దీ, పార్కింగ్​ స్థలాలకు సంబంధించిన త్రీడీ టోపోగ్రాపిక్‍ మ్యాపులను ఎన్ఐటీ సివిల్​ ఇంజినీర్ల బృందం అందించనున్నారు. ఈ డేటా డేటాతో శాస్త్రీయ పద్ధతుల్లో పట్టణాభివృద్ధి పనులు చేపట్టనున్నారు. 

నగరాభివృద్ధికి సరైన పాలసీ అందిస్తాం..

వరంగల్‍ నగరాభివృద్ధికి ఎన్‍ఐటీ తరఫున సాంకేతిక పరిజ్ఞాన సహకారం అందించేలా ఎన్‍ఐటీ డైరెక్టర్​తో కూడిన ప్రొఫెసర్ల బృందం ఎంవోయూ కుదుర్చుకున్నాం. అభివృద్ధికి కావాల్సిన ప్రణాళికలు రూపొందించే క్రమంలో జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లతో కలిసి రియల్‍ టైం స్టడీ చేపడుతం. జీఐఎస్‍ డ్రోన్‍ సర్వే చేపట్టడం ద్వారా రోడ్లు, డ్రైనేజీ, బిల్డింగులు, పార్కింగ్‍, వాటర్‍ సప్లై వంటి అంశాల్లో సమాచారం సేకరించి సరైన పాలసీ అందిస్తాం. గ్రేటర్ వరంగల్‍ అభివృద్ధిలో ఎన్‍ఐటీ తరఫున భాగస్వామ్యులుగా ఉంటాం.-ఎన్‍ఐటీ సివిల్‍ ప్రొఫెసర్లు శంకర్‍, శశి