గంగారం ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి : టి.కిరణ్రెడ్డి

గంగారం ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి : టి.కిరణ్రెడ్డి

కొత్తగూడ,(గంగారం), వెలుగు : నీతి ఆయోగ్​లో ఎంపికైన గంగారం మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్​ ప్రత్యేక ఆఫీసర్ టి.కిరణ్​రెడ్డి ఆదేశించారు. గంగారం బ్లాక్ ను తనిఖీ నిమిత్తం ఆయన సోమవారం మహబూబాబాద్​కు వచ్చారు. ఈ సందర్భంగా ఆ మండలం పై కలెక్టరేట్​లో కలెక్టర్​ అద్వైత్​ కుమార్ అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు.హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రీషన్, శానిటేషన్ పై క్షేత్రస్థాయిలో సంబంధిత ఆఫీసర్లు తీసుకుంటున్న చర్యలు, అభివృద్ధిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలోని ఆరోగ్య కేంద్రాలు, అంగన్​వాడీ సెంటర్ల ద్వారా ప్రజలు, చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్యం, షౌష్టికాహారం అందిస్తూ సేవలు అందించాలన్నారు.

స్కూళ్లలో విద్యార్థులకు మెనూ ప్రకారం బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ అందించాలన్నారు. షెడ్యూల్​ ప్రకారం స్టూడెంట్లకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. వ్యవసాయ శాఖ ఆఫీసర్లు పంటలపై అవగాహన కల్పించాలని చెప్పారు. మౌలిక వసతులు సంపూర్ణ అభియాన్ 2.0 ద్వారా అన్ని గ్రామాలకు టెలికాం సేవలు, రోడ్ల వసతులు తదితర వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అనంతరం ఆయన గంగారం మండలంలో పర్యటించారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​ లెనిన్ వత్సల్ టెప్పో, డీఆర్డీవో పీడీ మధుసూదన్​రాజు, జడ్పీ సీఈవో పురుషోత్తం, గంగారం బ్లాక్​ స్పెషల్​ ఆఫీసర్ శ్రీనాథ్​ ఉన్నారు.