కొంతకాలం క్రితం రాజ్యసభకు ఎన్నికైన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, సోమవారం (మార్చి 30) తన ఎమ్మెల్సీ (శాసన మండలి సభ్యత్వానికి) పదవికి రాజీనామా చేశారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒకేసారి రెండు సభల్లో సభ్యుడిగా ఉండకూడదు. అందుకే రాజ్యసభకు వెళ్తున్న నేపథ్యంలో ఆయన తన పాత పదవిని వదులుకున్నారు. తన రాజీనామా లేఖను మండలి ఛైర్మన్ అవధేష్ నారాయణ్ సింగ్‌కు స్వయంగా అందజేశారు.
నితిన్ నబిన్ కూడా రాజీనామా
బీజేపీ నేత నితిన్ నబిన్ కూడా బంకిపూర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన తన నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు ఒక భావోద్వేగ మెసేజ్ ఇచ్చారు. ఇది ముగింపు కాదు, ప్రజలకు సేవ చేయడానికి ఇదొక కొత్త ఆరంభం అని అన్నారు. 2006లో తన తండ్రి మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఎవరు?
నితీష్ కుమార్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తుండటంతో, బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అసెంబ్లీలో పెద్ద పార్టీగా ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ గత వారమే పార్టీలో చేరారు. ఆయనను కొత్త ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
