భవిష్యత్తులో బీజేపీతో పొత్తు ఉండదు

భవిష్యత్తులో బీజేపీతో పొత్తు ఉండదు

బీహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2013లో విడిపోయి సరిగ్గా నాలుగేండ్ల తర్వాత 2017లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం మూర్ఖత్వం అనిపించిందన్నారు. జేడీయూ ఉన్నంత కాలం కమలం పార్టీతో కలిసి నడిచే ప్రసక్తే లేదని నితీష్ స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు కారణంగా పలు రాష్ట్రాల్లో ప్రజలు తమ పార్టీకి దూరమయ్యారని చెప్పారు. కమలంతో కటీఫ్ తర్వాత వారిలో చాలా మంది తన చర్యను అభినందించారని చెప్పారు. 

2015లో బీహార్ లో జరిగిన ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. రెండేండ్ల తర్వాత డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయినా ఆయన రాజీనామా చేసేందుకు నిరాకరించారు. దీంతో నితీష్ కుమార్ కూటమి నుంచి వైదొలిగారు. అనంతరం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. దివంగత మాజీ ప్రధాని వాజ్ పేయి ప్రభుత్వంలో ఉన్నప్పుడు తనకు ఎంతో గౌరవం లభించిందని నితీష్ అన్నారు. ప్రస్తుతం పార్టీని కమలనాథులు ఎలా విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారో అర్థమైందని చెప్పారు. విపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నానన్న నితీష్ కుమార్.. త్వరలో ఢిల్లీ వెళ్లి పలు పార్టీలకు చెందిన నేతలతో సమావేశమవుతానని చెప్పారు. తనకు ప్రధాని పదవిపై ఆశలు లేవని స్పష్టం చేశారు.