నిజాం కాలేజీ విద్యార్థినులతో చర్చలు విఫలం

నిజాం కాలేజీ విద్యార్థినులతో చర్చలు విఫలం

హైదరాబాద్ : నిజాం కాలేజ్ హాస్టల్ వివాదం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడంలేదు. కొత్త హాస్టల్ నిర్మాణం, ప్రస్తుతం ఉన్న గర్ల్స్ హాస్టల్ లో యూజీ స్టూడెంట్స్ కు 50శాతం వసతి కల్పించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చినా విద్యార్థినులు మాత్రం అందుకు అంగీకరించడం లేదు. హాస్టల్ ను 100శాతం తమకే కేటాయించే వరకు పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెబుతున్నారు.

నిజాం కళాశాలలో కొత్తగా నిర్మించిన గర్ల్స్ హాస్టల్లో వసతి కల్పించాలంటూ యూజీ విద్యార్థినులు కొన్నాళ్లుగా నిరసన చేస్తుండంపై స్పందించిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల్లోగా కొత్త హాస్టల్ బిల్డింగ్ కట్టిస్తామని అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆర్డర్ కాపీని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.  200 మంది విద్యార్థినులకు సరిపడేలా హాస్టల్ బిల్డింగ్ నిర్మించేందుకు హెచ్ఎండీఏ అనుమతి ఇవ్వడంతో పాటు అందుకు అవసరమైన నిధులను ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ పేరిట రిలీజ్ చేసినట్లు ఆర్డర్ కాపీలో పేర్కొన్నారు. ఆరు నెలల్లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ ను కేవలం పీజీ విద్యార్థినులకు మాత్రమే కేటాయించాలని నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ నిర్ణయించారని, అయితే చర్చల అనంతరం యూజీ విద్యార్థినులకు 50శాతం, పీజీ స్టూడెంట్స్ కు 50శాతం వసతి కల్పించాలని ఆదేశిస్తూ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఈ మేరకు నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని నిజాం కాలేజ్ విద్యార్థినులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హాస్టల్ను పూర్తిగా యూజీ స్టూడెంట్స్కు కేటాయించే వరకు పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెబుతున్నారు. ఈ మేరకు సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ రీట్వీట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. నిజాం కాలేజీలో నిర్మించిన కొత్త హాస్టల్ను కేవలం పీజీ విద్యార్థినులకు మాత్రమే కేటాయించడంపై యూజీ స్టూడెంట్స్ కొన్ని రోజులుగా ఆందోళన చేపట్టారు. విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లడంతో సమస్యను పరిష్కరించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచించారు. సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆందోళన చేస్తున్న విద్యార్థినులతో పలు దఫాలుగా చర్చించారు. చివరకు కొత్త హాస్టల్ బిల్డింగ్ నిర్మాణంతో పాటు ప్రస్తుతం ఉన్న భవనంలో యూజీ, పీజీ వారికి 50శాతం చొప్పున వసతి కల్పిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న నిజాం కాలేజీ విద్యార్థినులు ఆందోళన విమరించేందుకు నిరాకరిస్తున్నారు.