ఆందోళన విరమించిన నిజాం స్టూడెంట్లు ఆగస్ట్ నుంచి పూర్తిస్థాయిలో డిగ్రీ స్టూడెంట్లకే హాస్టల్

ఆందోళన విరమించిన నిజాం స్టూడెంట్లు ఆగస్ట్ నుంచి పూర్తిస్థాయిలో డిగ్రీ స్టూడెంట్లకే హాస్టల్

బషీర్ బాగ్, వెలుగు: కాంగ్రెస్​ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్​హామీతో నిజాం కాలేజీ యూజీ స్టూడెంట్లు ఆందోళనను విరమించారు. కాలేజీ గర్ల్స్​హాస్టల్​ను పూర్తిస్థాయిలో తమకే కేటాయించాలని యూజీ స్టూడెంట్లు ఆరు రోజులుగా క్యాంపస్​లో ఆందోళన చేస్తున్నారు. నిరసనలో భాగంగా గురువారం వంటా వార్పు చేపట్టారు. అదే టైంలో అక్కడికి చేరుకున్న పీజీ స్టూడెంట్లు తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ బల్మూర్​వెంకట్ నిజాం క్యాంపస్​కు చేరుకుని యూజీ, పీజీ స్టూడెంట్లను సముదాయించారు. 

సీఎం రేవంత్​రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారని, రాగానే సమస్యపై చర్చించి న్యాయం చేస్తామని చెప్పారు. ఈలోపు ఓయూ వీసీతో మాట్లాడతామన్నారు. ప్రస్తుత పీజీ స్టూడెంట్ల అకడమిక్​ఇయర్​పూర్తయిన వెంటనే డిగ్రీ స్టూడెంట్లకు కాలేజీ హాస్టల్​ను పూర్తిస్థాయిలో కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రెండు రోజుల్లో ఆ మేరకు సర్క్యులర్​విడుదల చేయిస్తామని హామీ ఇచ్చారు. 

అదే విధంగా పీజీ స్టూడెంట్లకు న్యాయం చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న హాస్టల్​పై మరో రెండు అంతస్తులు నిర్మించడమా? లేక కొత్త బిల్డింగ్​నిర్మించడమా అనే అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అనంతరం యూజీ స్టూడెంట్లు మాట్లాడుతూ.. వచ్చే సోమవారం వరకు సర్క్యులర్​కోసం ఎదురుచూస్తామని, లేకుంటే ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.