
హైదరాబాద్: ఏడాదంతా నైజాం విముక్త అమృతోత్సవాలు నిర్వహిస్తున్నామని నైజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవ్ కమిటీ అధ్యక్షుడు జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి తెలిపారు. నైజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కమిటీలో సెక్రటరీగా మాజీ ఎంపీ వివేక్ సతీమణి సరోజ, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ లు హాజరై మాట్లాడారు. సెప్టెంబర్ 17తో పాటు ఏడాది పాటు నిర్వహించే కార్యక్రమాలపై చర్చించారు.
"దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణ ప్రజలకు ఆనాడు స్వాతంత్ర్యం రాలేదు. ఏడాది తర్వాత తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చింది. సాయుధ పోరాట ఫలితంతో తెలంగాణ ప్రజలకు విముక్తి లభించింది. ఈ ఉత్సవాల ఉద్దేశ్యం ఇతర మతాలను రెచ్చగొట్టేందుకు కాదు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన వారిని స్మరించుకోవడం కోసం మాత్రమే. హైదరాబాద్ కు స్వతంత్ర చరిత్ర తెలిసినా ..తెలంగాణ గ్రామాల్లో చాలామందికి తెలియదు. అందుకే ఏడాది పొడవున నైజాం విముక్త అమృతోత్సవాలు నిర్వహిస్తున్నాం. హైదరాబాద్ ఒక్కటే కాదు కొన్ని గ్రామాలు మహారాష్ట్ర, కర్నాటక లాంటి రాష్ట్రాల్లో తెలంగాణ గ్రామాలు కొన్ని ఉన్నాయి. సామాజిక సేవకులు, సాహిత్య కార్యక్రమాలు చేపడుతున్నాం.
జిల్లాల్లో, మండలాలు, గ్రామాల్లో ఉన్న ఆనాటి వ్యక్తులతో పోరాటాలకు సంబంధించిన విషయాలపై చర్చలు ఉంటాయి. సెప్టెంబర్ 17న అన్ని రెవెన్యూ మండలాల్లో జెండా ఆవిష్కరణ. నవంబర్ లో యువ సమ్మేళనాలు. జనవరి డోర్ టూ డోర్ జన జాగరణ. ఫిబ్రవరిలో మేధావులతో సమావేశాలు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 17న ఊరూరా జెండా, ఇంటింటికి జెండా కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సమావేశానికి మా సమావేశాలకు ఎలాంటి సంబంధం లేదు. రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు". అని సమావేశంలో తీర్మాణించారు.