- టీచర్లు పెద్ద నేరం చేశారు
- నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్, వెలుగు: టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్ ఘటనను ఈజీగా తీసుకోబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. బాధ్యులైన ఉపాధ్యాయులపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయని, చార్జ్‌షీట్ల అనంతరం ఉద్యోగాలు కోల్పోయేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగబోమని తెలిపారు. ఆదివారం ఎంఈవోలు, సీఎస్‌లతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. టీచర్లుగా గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ విద్యా వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్‌ఫోన్‌లతో ప్రశ్నాపత్రాలను చిత్రీకరించి బయటకు పంపడం తీవ్ర నేరమని పేర్కొన్నారు. పరీక్ష రద్దయితే విద్యార్థులపై పడే ప్రభావాన్ని ఆలోచించారా అని ప్రశ్నించారు. సస్పెన్షన్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరిస్తూ, కనీసం ఆరు నెలలు సస్పెన్షన్ కొనసాగించి, ఇంక్రిమెంట్ నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనను సర్వీస్ బుక్స్‌లో నమోదు చేయిస్తామని స్పష్టం చేశారు.
సెంటర్లలో కట్టుదిట్టమైన నిబంధనలు..
పరీక్షా కేంద్రాల్లో కచ్చితంగా నిబంధనలు పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. సీసీ కెమెరాల నిఘాలో ప్రశ్నాపత్రాలు తెరవాలని, ముందుగానే రోల్‌కాల్ నిర్వహించి సెల్‌ఫోన్‌లు లేవని నిర్ధారించుకోవాలని సూచించారు. కేంద్రంలోకి ఎవరికీ ఫోన్ అనుమతి లేదని, అది అందరికీ సమానంగా వర్తిస్తుందని పేర్కొన్నారు. పరీక్ష విధుల్లో లేని ఉపాధ్యాయులు కేంద్రాల పరిసరాల్లో తిరగరాదని, సెల్‌ఫోన్‌లతో కేంద్రంలోకి వస్తే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
12 మంది ఫ్లయింగ్ స్క్వాడ్
ఆఫీసర్ల నియామకం..
జిల్లాలో టెన్త్ పరీక్షలు ముగిసే వరకు 12 మంది ఎంఈవోలతో ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాన్ని నియమించినట్లు డీఈవో అశోక్ తెలిపారు. ఈ బృందంలో ఎంఈవోలు ఎ.గంగాధర్, ఎం.నరేందర్, ఎ.నాగయ్య, ఆంజనేయులు, జి. మధుసూదన్, ఎన్.ఆంధ్రయ్య, ఎన్.శ్రీనివాస్‌రావు, పి.రాములు, ఆర్‌వీఎన్ గౌడ్, సమ్మిరెడ్డి, బి.సీతయ్య, జి.నరేశ్ ఉన్నారు. వీరు జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాలను సందర్శిస్తూ పర్యవేక్షణ చేస్తారని తెలిపారు.
నలుగురిపై కేసులు
నిజామాబాద్ జిల్లాలో టెన్త్ క్వశ్చన్ పేపర్ సెల్‌ఫోన్ ద్వారా బయటకు వచ్చిన ఘటనలో నలుగురిపై ఆదివారం పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆలూర్ కేంద్రంలో ఇన్విజిలేషన్ విధులు నిర్వహించిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉమేందర్, ఎన్.సాగర్‌తో పాటు బయటి వ్యక్తులు సురేశ్, యోగేశ్ నిందితులుగా ఉన్నారు. ఈ నెల 18న సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష సమయంలో ఆలూర్ జడ్పీ హైస్కూల్ నుంచి తెలుగు ప్రశ్నాపత్రం, మెండోరా జడ్పీ స్కూల్ నుంచి హిందీ పేపర్ ఫొటో రూపంలో బయటకు వచ్చి వైరల్ అయిన విషయం తెలిసిందే. ఘటనను సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి ఏడుగురు టీచర్లను సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో ఆలూర్ కేంద్రానికి సంబంధించిన ఎంఈవో నరేందర్ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు. ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్ నిందితులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
