ప్రభుత్వం తప్పుడు అంచనా వల్లే యూరియా షార్టేజ్ : ఎంపీ అర్వింద్

ప్రభుత్వం తప్పుడు అంచనా వల్లే యూరియా షార్టేజ్ : ఎంపీ అర్వింద్

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే యూరియా కోసం రైతులు రోడ్డెక్కుతున్నారని అన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. దేశంలో ఎక్కడా లేని యూరియా కొరత తెలంగాణా లోనే ఎందుకొస్తోందో ఆలోచించాలని… ఇది పూర్తిగా ప్రభుత్వం వైఫల్యమే అని చెప్పారు అర్వింద్. కేవలం తెలంగాణ రైతన్నలకే ఈ కష్టం ఎందుకొచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

వర్షాకాలం వస్తోందని తెలిసి కూడా..  రైతులకు ఎంత యూరియా అవసరమో, ఇండెంట్ పంపడానికి కూడా కేసీఆర్ సర్కారుకు తీరిక లేదని, ఈ వర్షాకాలం సీజన్ లో ఎంత సాగు చేస్తారో అంచనా వెయ్యడంలో ప్రభుత్వం ఫెయిలైందని చెప్పారు ధర్మపురి అర్వింద్. ఆలస్యంగా ఇండెంట్ పంపినా కూడా అడిగినంత యూరియాను కేంద్రం తెలంగాణ కు సరఫరా చేసిందని చెప్పారు. ఇంకా కావాల్సినంత ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. ఇంత బద్దకం, అసమర్థత కలిగిన ప్రభుత్వం ఉండటం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని అన్నారు.

“రాష్ట్ర ప్రభుత్వం ఎంత వర్షాలు పడ్తాయో.. అంచనా తప్పు వేసింది. నాట్లు ఇన్ని వేస్తారు అని అంచనా తప్పుగా, తక్కువగా చేసింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ యూరియా షార్టేజ్ లేదు. అన్ని రాష్ట్రాలకు పుష్కలంగా కేంద్రం యూరియా సరఫరా చేస్తోంది. మనరాష్ట్రంలో ఇండెంట్లు, రిక్వైర్మెంట్లు తప్పుగా అంచనా వేసి.. లేట్ గా పంపించారు.. రాష్ట్ర ప్రభుత్వం సోమరితనం, అసమర్థత వల్లే ఈ సమస్య వచ్చింది” అని ధర్మపురి అర్వింద్ చెప్పారు.

మోడీ సర్కారు వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికి కూడా యూరియా కోసం రైతులు ఎదురు చూడాల్సిన అవసరం రాకుండా చేశారన్నారు అర్వింద్. రాష్ట్రంలో కృత్రిమంగా యూరియా కొరత సృష్టించారని కూడా అనుమానాలున్నాయని ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు.