కవిత అవివేకంతో మాట్లాడుతున్నరు

కవిత అవివేకంతో మాట్లాడుతున్నరు

నిజామాబాద్, వెలుగు: జిల్లా రాజకీయాల్లోకి వలస రాలేదని, తాను పక్కా లోకల్​ లీడర్ నని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి  అర్వింద్​ చెప్పారు. జిల్లా అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నానని, నిధుల మంజూరుపై అవగాహన లేకుండా ఎమ్మెల్సీ కవిత మాట్లాడడం ఆమె అవివేకమని అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన స్పైసెస్​బోర్డుకు  రూ. 2.73 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై బుధవారం సాయంత్రం అర్వింద్​ఓ ప్రకటన విడుదల చేశారు. పసుపు రైతుల కోసం 2021‌లో రూ. 74.81 లక్షలు మాత్రమే విడుదల అయ్యాయని కవిత పేర్కొనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఆర్టీఐ కింద 2021 మే 9 న దరఖాస్తు చేస్తే అక్టోబర్​ 5న స్పైసెస్​ బోర్డ్​నిధుల వివరాలను తెలిపిందన్నారు. అక్టోబర్​అనంతరం రెండుసార్లు నిధులు విడుదల అయ్యాయని చెప్పారు. పసుపు రైతుల సంక్షేమానికి దేశంలోని 10 రీజినల్​ సెంటర్లకు రూ. 6.75 కోట్లు విడుదలయ్యాయన్నారు. కవిత ఎంపీగా పనిచేసిన అయిదేండ్లలో 13 బాయిలర్లు, 3 పాలిషర్లు మంజూరయ్యాయని, తాను ఎన్నికైన మూడేండ్లలో 108 బాయిలర్లు, 209 పాలిషర్లు, 7,240 టార్పాలిన్​ షీట్లను పసుపు రైతులకు అందించినట్లు తెలిపారు.