
- 50 ఎంబీబీఎస్ సీట్లతో అనుమతులు జారీ
- ఈ ఏడాది నుంచే ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ
- ఈఎస్ఐసీలోనూ 25 మెడికల్ సీట్ల పెంపునకు ఓకే
హైదరాబాద్/ కొడంగల్, వెలుగు: రాష్ట్రంలో మరో మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పర్మిషన్ ఇచ్చింది. కొడంగల్ మెడికల్ కాలేజీకి 50 ఎంబీబీఎస్ సీట్లతో అనుమతులు ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2025–26 విద్యా సంవత్సరం నుంచే కొడంగల్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. కొడంగల్ మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ అనుమతులు ఇవ్వడంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తూ, మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులను అభినందించారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ప్రస్తుతం కొడంగల్ మెడికల్ కాలేజీతో ఆ సంఖ్య 35 కు చేరింది. మొత్తం మెడికల్ సీట్లు 4,100 పైనే ఉన్నాయి. కొడంగల్ మెడికల్ కాలేజీ శాశ్వత భవనం కోసం కొడంగల్ మండలం అప్పాయిపల్లిలో నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం తాండూరులోని ప్రభుత్వ ఆస్పత్రిని అప్ గ్రేడ్ చేశారు. అందులో మెడికల్ కాలేజీని కొనసాగించనున్నారు.
మల్లారెడ్డి కాలేజీల్లో సీట్ల పెంపునకు ఎన్ఎంసీ నో...
రాష్ట్రంలోని మల్లారెడ్డి కాలేజీల్లో సీట్ల పెంపునకు ఎన్ఎంసీ నో చెప్పింది. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మల్లారెడ్డి మెడికల్ కాలేజీ ఫర్ విమెన్ కాలేజీలు ప్రస్తుతం ఒక్కో కాలేజీలో 200 సీట్లతో కొనసాగుతున్నాయి. ఒక్కో కాలేజీలో అదనంగా 50 సీట్లు పెంచాలని కాలేజీలు ఎన్ఎంసీకి దరఖాస్తు చేసుకున్నాయి. అయితే, ఈ రెండు కాలేజీల్లో సీట్ల పెంపునకు ఎన్ఎంసీ అనుమతి నిరాకరించింది. సీట్ల పెంపునకు సంబంధించి సరైన వసతులు చూపని కారణంగా సీట్ల పెంపునకు నిరాకరించిందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈఎస్ఐసీ ఆస్పత్రిలో 25 మెడికల్ సీట్ల పెంపునకు ఎన్ఎంసీ అనుమతినిచ్చింది. ప్రస్తుతం ఈఎస్ఐసీలో 125 సీట్లు ఉండగా, ఆ సంఖ్య 150కి చేరింది. మరోవైపు స్థానికతపై సుప్రీంకోర్టు స్పష్టతనివ్వడంతో స్టేట్ కోటా కౌన్సెలింగ్ నిర్వహణకు కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ సన్నాహాలు చేస్తున్నది. ఈ నెల 11 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉన్నది.