
కొత్తగా ప్రమోట్ అయిన జిల్లా ఆస్పత్రుల దశ మారనుంది. ఆ ఆస్పత్రుల అభివృద్ధికి నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) కింద నిధులిచ్చేందుకు కేంద్రా ఆరోగ్య శాఖ ముందుకొచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కొత్త జిల్లాలు ఏర్పడ్డాక ఆయా జిల్లాల్లోని ఏరియా ఆస్పత్రులను జిల్లా ఆస్పత్రులుగా చేసిన సంగతి తెలిసిందే. జిల్లా ఆస్పత్రులుగా బోర్డు మార్చారే తప్ప లోపల సౌకర్యాలు మాత్రం కరువయ్యాయి. దీంతో చాలా మంది రోగులు చాలా దూరంలో ఉన్న పాత జిల్లా ఆస్పత్రులకే వెళుతున్నారు. అందుకే కొత్త జిల్లా ఆస్పత్రుల అభివృద్ధికి నేషనల్ హెల్త్ మిషన్ కింద ఒక్కో దవాఖానకు రూ.60 కోట్ల చొప్పున ఇవ్వాల్సిందిగా కేంద్రానికి రాష్ట్ర సర్కార్ ప్రతిపాదన పెట్టింది. ఆ ప్రతిపాదనకు కేంద్రం అంగీకరించిందని అధికారులు అంటున్నారు.
3 దశలు, 27 ఆస్పత్రులు
మొత్తం 3 దశల్లో 27 దవాఖాన్లను అభివృద్ధి చేయనున్నారు. సోమ, మంగళవారాల్లో ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో వర్క్‌షాప్ నిర్వహించారు. ఆస్పత్రుల డిజైన్లు, ఆస్పత్రి నిర్వహణ తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. తొలి దశలో భాగంగా ములుగు, నారాయణపేట, జయశంకర్ భూపాలపల్లి, నర్సంపేట (వరంగల్ రూరల్), మహబూబాబాద్, నిర్మల్, అసిఫాబాద్, సిరిసిల్ల, గద్వాల్ జిల్లా కేంద్రాల్లోని హాస్పిటళ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇండియా ప్రజా ఆరోగ్య ప్రమాణాల (ఐపీహెచ్ఎస్) ప్రకారం ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించనున్నారు. ఇప్పుడు ఆయా ఆస్పత్రుల్లో 50 నుంచి 100 బెడ్లు మాత్రమే ఉన్నాయి. వాటిని 250కి పెంచనున్నారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, అనస్తీషియా, పీడియాట్రిక్ తదితర విభాగాల్లో డాక్టర్లను నియమిస్తారు. క్రిటికల్ కేర్, ఎమర్జన్సీ యూనిట్, అంబులెన్స్, ఆపరేషన్ థియేటర్లను అందుబాటులోకి తీసుకొస్తారు. సీటీ స్కాన్, అల్ట్రా సౌండ్ స్కాన్, ఈసీజీ, ఎక్స్‌రే, ఎండోస్కోపీ వంటి డయాగ్నస్టిక్ పరికరాలను సమకూరుస్తారు.