సర్కారు బడుల్లో ఇంగ్లీష్  మీడియం.. ప్రభుత్వం విఫలం

సర్కారు బడుల్లో ఇంగ్లీష్  మీడియం.. ప్రభుత్వం విఫలం

రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఇంగ్లీష్  మీడియం బోధన.. అంచనాలను అందుకోలేకపోయిందనే విమర్శలు వినిస్తున్నాయి. సర్కారు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి.. నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వం భావించింది. కానీ ఒకటో తరగతిలో సరిగా  అడ్మిషన్లు కాలేదని తెలుస్తోంది. ఉపాధ్యాయుల కొరత.. సరైన సౌకర్యాలు లేకపోవటంతో.. ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులు చేరటం లేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు అంటున్నారు.

సర్కారు స్కూళ్లలో ఇంగ్లీష్  మీడియం బోధన లేకపోవటంతో.. ఫీజులు ఎక్కువైనా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లల్లో చేర్పిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి 26 వేలకు పైగా బడుల్లో1నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్  మీడియాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పాఠశాలల్లో తరగతి గదుల మరమ్మతులు, కొత్త వాటి నిర్మాణం, ప్రహరీ గోడలు, టాయిలెట్స్, మంచినీటి సౌకర్యం.. తదితర12 రకాల మౌలిక వసతుల కల్పనకు మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. కానీ పథకం అమలుకు సరైన నిధులు కేటాయించకపోవటంతో.. అనుకున్న స్థాయిలో పాఠశాలల్లో అభివృద్ధి పనులు జరగలేదని ఉపాధ్యాయసంఘాల నేతలు అన్నారు. దీంతో ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియంలో చేర్చేందుకు తల్లిదండ్రులు పెద్దగా ఆసక్తి చూపలేదంటున్నారు.

ఈ ఏడాది ప్రైవేట్ బడుల నుంచి ప్రభుత్వ బడులకు చాలా అడ్మిషన్లు వస్తాయని అధికారులు అంచనా వేశారు. కానీ అలా జరగలేదు. ఈ విద్యా సంవత్సరంలో ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లకు ఒకటో తరగతిలో చేరింది13వేల 379 మంది మాత్రమే. అంటే ప్రీ ప్రైమరీని ప్రైవేటు బడుల్లో చదివి.. ఇంగ్లీష్  మీడియం కోసం ప్రభుత్వ బడుల్లో చేరినవారు వీళ్లు మాత్రమే. గతేడాది ఒకటో తరగతిలో దాదాపు 3లక్షల 18వేల మంది చేరితే.. ఈనెల 1వ తేదీ వరకు లక్షా 13వేల 273 మంది మాత్రమే చేరారు. ఇందులో అత్యధికంగా 95వేల 129 మంది విద్యార్థులు అంగన్  వాడి కేంద్రాల నుంచి వచ్చిన వారే ఉన్నారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి.

విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభుత్వ విద్య ఆకర్షించకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. ఇంగ్లీష్ మీడియం బోధనపై నమ్మకాన్ని కల్గించకపోవటం, సరిపడా టీచర్లు లేరనే అభిప్రాయం ఉండడంతో.. ప్రభుత్వ బడుల్లో తమ పిల్లలను చేర్చేందుకు ఆసక్తి చూపలేదంటున్నారు. బడుల్లో అరకొర సౌకర్యాలు, సరిపడ ఉపాధ్యాయిలు లేకనే.. ఇంగ్లీష్ మీడియంలో అడ్మిషన్లు కాలేదంటున్నారు. ప్రభుత్వం పథకాలు ప్రవేశపెడితే సరిపోదని.. వాటి అమలుకు చిత్తశుద్ధితో పనిచేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు అంటున్నారు. 

ఇంగ్లీష్  మీడియాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. విద్యార్థులకు, తల్లిదండ్రులకు భరోసా కల్పించటంలో విఫలమైందని విద్యావేత్తలు అంటున్నారు. సరైన సౌకర్యాలు, టీచర్లు లేకపోవటం వల్లే.. ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో చేరేవారి సంఖ్య తగ్గుతూ వస్తోందని చెబుతున్నారు.