
న్యూఢిల్లీ: ప్రభుత్వం టెలికాం కంపెనీలకు సంబంధించిన అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్) బకాయిలపై ఎలాంటి మినహాయింపులు ఇవ్వదని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఏజీఆర్ బకాయిలను తగ్గిస్తుందనే అంచనాలతో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (వీఐ) షేర్లు శుక్రవారం భారీగా పెరిగాయి. ఈ రెండు సంస్థలు కలిపి సుమారు రూ.1.20 లక్షల కోట్ల బకాయిలను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది.
టెలికాం సెక్టార్ కోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డాట్) తాజాగా ఒక రిలీఫ్ ప్యాకేజీని క్యాబినెట్‌కు ప్రతిపాదించింది. ఇందులో వడ్డీపై 50శాతం మినహాయింపు, జరిమానాలు, వాటిపై వడ్డీకి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని సూచించింది. అయితే, కేబినెట్ ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. ఈ నిర్ణయం ప్రభావం వీఐ పై ఎక్కువగా ఉంటుంది. ఈ కంపెనీ ఏజీఆర్ బకాయిలు సుమారు రూ.80 వేల కోట్లని అంచనా.
ఎయిర్‌టెల్‌కు సుమారు రూ.42 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. ఏజీఆర్ బకాయిలకు సంబంధించి ఎటువంటి రిలీఫ్ దొరకకపోతే ఎయిర్‌టెల్, వీఐ కంపెనీల 5జీ నెట్‌వర్క్ విస్తరణ ఆలస్యమవ్వొచ్చు. ఏజీఆర్ సమస్య 2019లో వెలుగులోకి వచ్చింది. టెలికాం సంస్థలు గతంలో రెవెన్యూ షేరింగ్ విధానంలో లబ్ధి పొందాయని పేర్కొంటూ, డాట్‌కు లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు చెల్లించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఏజీఆర్‌ను తిరిగి లెక్కించాలని ఎయిర్‌టెల్, వీఐ సుప్రీం కోర్టులో పిటిషన్లు వేసినా, 2021, 2024లో కోర్టు వీటిని తిరస్కరించింది.
ఏజీఆర్ అంశంపై కామెంట్ చేయడానికి టెలికాం మినిస్టర్ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిరాకరించారు. అయితే వీఐ భవిష్యత్‌పై ప్రశ్నించగా, “ప్రతి సంస్థ నిబంధనలకు లోబడి పనిచేయాలి. భారత ప్రభుత్వం టెలికాం రంగంలో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని చూస్తోంది. ప్రపంచంలో నాలుగు టెల్కోలు ఉన్న మార్కెట్లు చాలా అరుదు” అని వ్యాఖ్యానించారు.