న్యూఢిల్లీ: కొత్త ఓటరుగా పేరు నమోదు చేసుకోవడానికి ఉపయోగించే 'ఫారమ్ 6'లో ఎలాంటి మార్పులు చేయలేదని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ ) స్పష్టం చేసింది. పాత ఫారమ్ అలాగే ఉందని, కాకపోతే తల్లిదండ్రులు లేదా గ్రాండ్ పేరెంట్ వివరాలు తెలుసుకోవడానికి 'ఫారమ్ 6'కు అనుబంధంగా 'అనెగ్జర్ డి' పేరుతో అదనపు డిక్లరేషన్‌ను మాత్రమే జత చేశామని గురువారం స్పష్టం చేసింది. కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే యువతీయువకులు సాధారణంగా వయస్సు, చిరునామా వంటి ప్రాథమిక వివరాలు మాత్రమే ఫారమ్ 6లో నింపాల్సి ఉంటుంది.
అయితే, ఇటీవల ఆన్లైన్లో ఉన్న ఈ ఫారమ్‌లో ఒక కొత్త నిబంధనను చేర్చారు. కొత్త ఓటర్లు తమ తల్లిదండ్రులు లేదా గ్రాండ్ పేరెంట్ పేర్లు గతంలో వచ్చిన 'సర్ 'లిస్టులో ఉన్నాయో లేదో తెలపాలని ఆన్లైన్ ఫారమ్‌లో అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోతే ఆన్లైన్లో దరఖాస్తు ముందుకు కదలదు. ఫారమ్ సబ్మిట్ కాదు. దీంతో యువత కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఇబ్బందిపడుతున్నారు.
ఈసీ నిబంధనలపై సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అనే ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనధికారిక నిబంధనల వల్ల కొత్త ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే యువతీయువకులకు ఇబ్బందులు ఎదురవుతాయని, చివరికి ఓటు హక్కునే కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కొత్త మార్పులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ కొత్త నిబంధనపై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. కానీ, ఫారమ్‌లో మార్పులు చేయడం చట్టవిరుద్ధం, వెంటనే తొలగించాలని తోటి కమిషనర్లు చేసిన డిమాండును ఈసీ బేఖాతరు చేసింది. ఆ అభ్యంతరాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదనేదానిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
ఈసీఐనెట్‌లో రోల్‌బ్యాక్ లేదు
మరోవైపు, గోవాలో ఓటర్ల తొలగింపు వివాదంపై కూడా ఎన్నికల సంఘం కీలక వివరణ ఇచ్చింది. ప్రత్యేక సవరణ (సర్) సమయంలో తప్పులు ఉన్నాయంటూ తొలగించిన 97 మంది ఓటర్లు తర్వాత విచారణలో అర్హులుగా తేలారని తెలిపింది. 'ఫారమ్ 7' ద్వారా ఓటరు పేరును తొలగించిన తర్వాత, ఆ పొరపాటును తిరిగి వెనక్కి మార్చే అవకాశం (రోల్‌బ్యాక్) తమ 'ఈసీఐనెట్' సాఫ్ట్‌వేర్‌లో లేదని ఈసీ తెలిపింది. దీంతో ఆ అర్హులైన 97 మంది పేర్లు తుది ఓటర్ల జాబితాలో చేరకుండానే ఉండిపోయాయని వివరించింది.
రాష్ట్రాల ఓటర్ల జాబితాలను కేంద్ర ఎన్నికల సంఘం తయారు చేయడం లేదని తెలిపింది. ప్రతి నియోజకవర్గ ఓటర్ల సమాచారం స్థానిక అధికారుల పరిధిలోనే ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. 'ఈసీఐనెట్' ఆన్లైన్ వ్యవస్థ పనులను సులువు చేసే డిజిటల్ వేదికే తప్ప, దాని ద్వారా కేంద్రం రాష్ట్రాల ఓటర్ల జాబితాలను నేరుగా నియంత్రించబోదని స్పష్టం చేసింది. అయితే, 97 మంది పేర్లను మళ్లీ జాబితాలో చేర్చాలని గోవా సీఈవో ఢిల్లీ అధికారులకు ఈమెయిల్స్ ద్వారా విజ్ఞప్తి చేసినా ఎందుకు స్పందించలేదనే అంశంపై ఈసీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
