కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ పై ఉత్కంఠ.. 20 సీట్లపై కొలిక్కిరాని చర్చలు

కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ పై ఉత్కంఠ.. 20 సీట్లపై కొలిక్కిరాని చర్చలు
  •  కేసీ వేణుగోపాల్ ఇంట్లో స్క్రీనింగ్ కమిటీ భేటీ!
  •  కామ్రేడ్ల పొత్తుపై కొనసాగుతున్న సస్పెన్స్ 
  • హుస్నాబాద్, కొత్తగూడెం అడుగుతున్న సీపీఐ
  •  పాలేరు, ఇబ్రహీం పట్నం కోసం సీపీఎం పట్టు
  • సీపీఎం, సీపీఐలకు ఒక్కొక్క సీటు ఇచ్చే చాన్స్?
  •  ఈ రాత్రికి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్
  • దాదాపుగా పూర్తి స్థాయిలో రేపు జాబితా విడుదల చేసే అవకాశం

హైదరాబాద్: కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ పై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. గత ఆదివారం 55 మందితో తొలిజాబితా విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీకి సెకండ్ లిస్ట్ తయారీ కత్తిమీద సాములా మారింది. దాదాపు 15 నుంచి 20 సెగ్మెంట్ల విషయంలో స్క్రీనింగ్ కమిటీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం రావడం లేదని సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న స్క్రీనింగ్ కమిటీ సభ్యులు ఏఐసీసీ నాయకుడు కేసీ వేణుగోపాల్ ఇంట్లో భేటీ అయ్యారు. ప్రధానంగా ఇద్దరు నేతలు పోటీ పడుతున్న సెగ్మెంట్లలో ఎవరిని ఫైనల్ చేయాలనేదానిపై కసరత్తు చేస్తున్నారు. తుది జాబితా రూపొందించి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి అందించనున్నారు. ఇవాళ రాత్రి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ జాబితాను ఫైనల్ చేసే అవకాశం ఉంది. దీంతో రేపు ఉదయం జాబితా వెలువడే అవకాశాలున్నాయి. కీలక నేతలు టికెట్ ఆశిస్తున్న స్థానాలపైనే ప్రతిష్టంబన కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ టికెట్ ఆశిస్తున్నారు. గతంలో ఇక్కడ పోటీ చేసి ఓటమి పాలైన ప్రవీణ్ రెడ్డి తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇదే టికెట్ ను పొత్తులో భాగంగా తమకు కేటాయించాలని సీపీఐ కోరుతోంది. ఇక్కడి నుంచి చాడ వెంకటరెడ్డి బరిలోకి దిగాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయించే అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది. 

Also Read : కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ పై ఉత్కంఠ.. 20 సీట్లపై కొలిక్కిరాని చర్చలు

దీంతో పాటు ఎల్బీనగర్ స్థానాన్ని మాజీ ఎంపీ మధుయాష్కీ కోరుతున్నారు. ఇదే స్థానం కోసం మల్ రెడ్డి రాంరెడ్డి పట్టుబడుతున్నారు. ఖమ్మం, ఇబ్రహీం పట్నం, పాలేరు స్థానాలను పొత్తులో భాగంగా తమకు కేటాయించాలని సీపీఎం కోరుతోంది. అయితే ఇబ్రహీం పట్నం నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు టికెట్ ఆశిస్తున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం సీపీఎంకు మిర్యాలగూడ టికెట్ ఇస్తామనే ఆఫర్ ఇస్తోంది. తమకు మునుగోడు స్థానాన్ని కేటాయించాలని సీపీఎం కోరుతుండటం గమనార్హం. కనీసం ఫ్రెండ్లీ కంటెస్ట్ కైనా ఓకే చెప్పాలని సీపీఎం కోరుతుండగా కాంగ్రెస్ అందుకు సమ్మతించడం లేదు. 

తుది వరకు ప్రయత్నాలు

టికెట్ ఆశిస్తున్న నేతలకు ఢిల్లీలోని తెలంగాణ భవన్ కేరాఫ్ గా మారింది. చివరి ప్రయత్నాల కోసం హస్తిన చేరిన నేతలు వివిధ మార్గాల ద్వారా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కొందరు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారా ప్రయత్నాలు సాగిస్తుండగా కొందరు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి తమకు టికెట్ వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సెకండ్ లిస్ట్లో ఎన్ని సెగ్మెంట్లుంటాయి? సీపీఐ, సీపీఎం స్థానాలపై క్లారిటీ ఇస్తుందా..? లేక కొన్ని స్థానాలను పెండింగ్ లో పెడుతుందా.? అన్నది ఉత్కంఠగా మారింది.

అసంతృప్తులు దారికొచ్చేదెలా?

కాంగ్రెస్ పార్టీ 55 మందితో గత ఆదివారం ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది. ఆ తర్వాత చాలా మంది లీడర్లు పార్టీని వీడారు. ఉప్పల్ నుంచి టికెట్ ఆశించిన రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. కొల్లాపూర్ టికెట్ పై ఆశలు పెట్టుకున్న జగదీశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడారు. తాను ఫార్వార్డ్ బ్లాక్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. మేడ్చల్ టికెట్ ఆశించిన హరివర్ధన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఆయన అనుచరులు ఏకంగా గాంధీభవన్ ఎదుటే పీసీసీ చీఫ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. గద్వాల టికెట్ ఆశించిన కురువ విజయ్ కుమార్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు జెండా ఎత్తారు. రేవంత్ టికెట్ అమ్ముకున్నారంటూ బహిరంగ ఆరోపణలు చేశారు. రెండో జాబితా ప్రకటిస్తే ఇంకా ఎంత మంది బయటికి వెళ్తారోననే భయం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వాన్ని వెంటాడుతోంది.