సత్తా చాటిన తీక్షణ, హసరంగ: వరల్డ్ కప్‎లో సొంత గడ్డపై శ్రీలంక బోణీ

సత్తా చాటిన తీక్షణ, హసరంగ: వరల్డ్ కప్‎లో సొంత గడ్డపై శ్రీలంక బోణీ

కొలంబో:  సొంత గడ్డపై టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ను శ్రీలంక విజయంతో ఆరంభించింది. బౌలింగ్‌‌‌‌‌‌‌‌, బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌ సవాల్ విసిరినా ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌తో మెప్పించిన లంక బోణీ చేసింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 20  రన్స్ తేడాతో ఐరిష్ టీమ్‌‌‌‌‌‌‌‌పై గెలిచింది. తొలుత లంక 20 ఓవర్లలో163/6 స్కోరు చేసింది. కుశాల్ మెండిస్ (43 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లతో 56 నాటౌట్‌‌‌‌‌‌‌‌), కమిందు మెండిస్ (19 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 44) సత్తా చాటారు.

 ఐర్లాండ్ బౌలర్లలో జార్జ్ డాక్రెల్ (2/17),  బ్యారీ మెకార్తీ (2/40) చెరో రెండు వికెట్లతో రాణించారు. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో ఐర్లాండ్ 19.5 ఓవర్లలో  143 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది. హ్యారీ టెక్టర్ (40), రాస్ అడైర్ (24) పోరాడారు. మహేశ్ తీక్షణ (3/23), వానిందు హసరంగ (3/25) మూడేసి వికెట్లతో లంకను గెలిపించారు. కమిందుకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

ఆదుకున్న కమిందు, కుశాల్

టాస్ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన లంకను ఆరంభంలోనే ఐరిష్ బౌలర్లు ఇబ్బంది పెట్టారు. ఓపెనర్ కమిల్ మిషారా (14)ను నాలుగో ఓవర్లోనే మార్క్ అడైర్ ఔట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. మరో ఓపెనర్ పాథుమ్ నిశాంక (24) జాగ్రత్తగా ఆడగా.. వన్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన కుశాల్ మెండిస్ ఆరో ఓవర్లో మూడు ఫోర్లతో జోరు చూపెట్టాడు. దాంతో పవర్ ప్లేలో లంక 50/1 తో  మెరుగ్గా కనిపించింది. కానీ, ఫీల్డింగ్ మారిన తర్వాత ఐరిష్  స్పిన్నర్లు జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ అద్భుతంగా బౌలింగ్ చేశారు. 

స్టిర్లింగ్ పట్టిన క్యాచ్‌‌‌‌‌‌‌‌తో నిశాంకను పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేర్చిన డాక్రెల్ ఆ వెంటనే  పవన్ రత్నాయకే (5)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దునిత్ వెల్లలాగే (10)ను 14వ ఓవర్లో డెలానీ పెవిలియన్ చేర్చాడు.  ఓ దశలో వరుసగా తొమ్మిది ఓవర్లలో 57 బాల్స్‌‌‌‌‌‌‌‌లో ఒక్క బౌండరీ కూడా రాలేదు. దాంతో 15 ఓవర్లకు లంక 95/4తో నిలిచింది. అయితే, ఐరిష్ ఫీల్డర్ల తప్పిదాలతో ఔటయ్యే  ప్రమాదం తప్పించుకున్న కమిందు మెండిస్‌‌‌‌‌‌‌‌, కుశాల్ మెండిస్ స్లాగ్ ఓవర్లలో సత్తా చాటారు. 

ముఖ్యంగా కమిందు మెండిస్ భారీ షాట్లతో విజృంభించాడు.  డెలానీ ఓవర్లో  ఫోర్ కొట్టి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌కు చలనం తెచ్చిన అతను హంఫ్రేస్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో వరుసగా 6, 4, 4తో బాది ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌లో జోష్ నింపాడు. మార్క్ అడైర్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో కుశాల్ ఓ సిక్స్ బాదగా.. 19వ ఓవర్లో కమిందు 4, 6 కొట్టి లాస్ట్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌కు ఔటయ్యాడు. దాంతో ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌కు  67 రన్స్ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ముగిసింది. కెప్టెన్ షనక (0) డకౌటైనా.. లాస్ట్ ఓవర్లో ఓ ఫోర్ సహా 9 రన్స్ రాబట్టిన కుశాల్ ఫిఫ్టీ పూర్తి చేసుకోవడంతో పాటు స్కోరు 160 మార్కు దాటించాడు.  

దెబ్బకొట్టిన తీక్షణ, హసరంగ

ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌ పోటాపోటీగా ఆడింది. ఓ దశలో 104/2తో లంకకు షాకిచ్చేలా కనిపించినా.. స్పిన్నర్లు  మహేశ్ తీక్షణ, హసరంగ కీలక సమయాల్లో వికెట్లు తీసి ఆ జట్టును పడగొట్టారు. ఆరంభంలో రాస్ అడైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెరుపులు మెరిపించగా.. క్రీజులో ఇబ్బంది పడ్డ మరో ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్ స్టిర్లింగ్ (6)ను నాలుగో ఓవర్లో తీక్షణ బౌల్డ్ చేయగా.. రాస్ ఇచ్చిన క్యాచ్‌‌‌‌‌‌‌‌ను పతిరణ డ్రాప్ చేశాడు. 

ఈ చాన్స్‌‌‌‌‌‌‌‌ను సద్వినియోగం చేసుకున్న రాస్ .. వెల్లలాగే ఓవర్లో సిక్స్, చమీర బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో రెండు ఫోర్లు రాబట్టి  పవర్ ప్లేను 45/1తో ముగించాడు. రాస్‌‌‌‌‌‌‌‌ను ఏడో ఓవర్లో స్పిన్నర్ హసరంగ బౌల్డ్ చేసినా.. హ్యారీ టెక్టర్, లోక్రాన్ టకర్ లంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.  క్రమం తప్పకుండా బౌండరీలు కొడుతూ 14 ఓవర్లలో స్కోరు వంద దాటించి ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌ను రేసులో నిలిపారు. 

కీలక సమయంలో లంక బౌలర్లు పుంజుకున్నారు. వరుస ఓవర్లలో టకర్‌‌‌‌‌‌‌‌ను వెల్లలాగే, టెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హసరంగ పెవిలియన్ చేర్చగా.. 17వ ఓవర్లో వరుస బాల్స్‌‌‌‌‌‌‌‌లో బెంజిమన్‌‌‌‌‌‌‌‌ కలిట్జ్‌‌‌‌‌‌‌‌ (4), గారెత్ డెలానీ (0)ని ఔట్ చేసిన తీక్షణ.. ఐరిష్ టీమ్ జోరుకు బ్రేకులు వేశాడు. కర్టిస్ క్యాంఫర్ (13), మార్క్ అడైర్ (10) భారీ షాట్లు ఆడే ప్రయత్నంలో ఔటవగా.. లాస్ట్ ఓవర్లో డాక్రెల్ (9), హంప్రేస్ (0) వికెట్లు తీసిన పతిరణ ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌ను ఆలౌట్ చేశారు.

సంక్షిప్త స్కోర్లు

శ్రీలంక: 20 ఓవర్లలో 20 ఓవర్లలో 163/6  (కుశాల్ మెండిస్ 56 నాటౌట్‌‌‌‌‌‌‌‌, కమిందు మెండిస్ 44, డాక్రెల్ 2/17).
ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌:  19.5 ఓవర్లలో 143 ఆలౌట్ (టెక్టర్ 40, రాస్ అడైర్ 34, తీక్షణ 3/23, హసరంగ 3/25).

మరిన్ని వార్తలు