ఫంక్షన్లలో కరోనా రూల్స్ బేఖాతర్

ఫంక్షన్లలో కరోనా రూల్స్ బేఖాతర్
  • పెండ్లిళ్లు, ఎంగేజ్మెంట్లు, గృహ ప్రవేశాల్లో నో ఫిజికల్ డిస్టెన్స్
  • ఒకరిద్దరి నుంచి వందల మందికి వ్యాప్తిస్తున్న మహమ్మారి

హైదరాబాద్‌, వెలుగు: కరోనా టైమ్​ లో పెండ్లిళ్లు, ఫంక్షన్లు బంధు మిత్రులకు ఆపదను తెచ్చిపెడుతున్నాయి. కరోనా గైడ్ లైన్స్​ పాటించకుండా నిర్వహించే ఫంక్షన్లు అందరి ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. కేసులతోపాటు మరణాలూ అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. పరిస్థితి చెయ్యి దాటిపోయే ప్రమాదం ఉండటంతో సర్కారు లాక్‌డౌన్‌ విధించింది. అయితే పెండ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు మాత్రం పర్మిషన్‌ ఇచ్చింది. లాక్‌డౌన్‌ కంటే ముందు 100 మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. లాక్‌డౌన్‌ అమలు తర్వాత పెండ్లిళ్లతోపాటు ఎంగేజ్‌మెంట్లు, గృహప్రవేశాలు తదితర ఫంక్షన్లను 40మందితో మాత్రమే జరుపుకోవాలని స్పష్టం చేసింది. కరోనా రూల్స్ కంపల్సరీ పాటించాలని ఆదేశించింది. ఫంక్షన్లకు తహసీల్దార్‌ అనుమతి తప్పనిసరి చేశారు. తహసీల్దార్‌ ఆఫీస్​కు పూర్తి వివరాలతో అప్లికేషన్‌ పెట్టుకుంటే అన్ని అంశాలను పరిశీలించి అనుమతులు ఇస్తారు. వివాహం జరిగే ప్రదేశం, పెండ్లి తేదీ, సమయం తెలియజేస్తూ దరఖాస్తును అందజేయాలి. పెండ్లి కూతురు, పెండ్లి కుమారుడికి కరోనా నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేశారు.

నో ఫిజికల్ డిస్టెన్స్, నో మాస్క్..
అనేక చోట్ల ఫంక్షన్లలో కరోనా రూల్స్​ పాటించడం లేదు. మాస్కులు కూడా ధరించడం లేదు. ఫిజికల్ డిస్టెన్స్‌ ను గాలికొదిలేసి గుంపుగుంపులుగా గుమిగూడుతున్నారు. వందల మంది అటెండ్‌ కావడం, రూల్స్‌ పాటించకపోవడంతో కరోనా వ్యాపిస్తోంది. అధికారులు మాత్రం పర్మిషన్లు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

ఇటీవల నమోదైన కొన్ని కేసులు ఇవీ..

  • ఖమ్మం జిల్లాలోని ముత్యాలగూడెంలో ఓ పెళ్లికి 250మంది వరకు హాజరయ్యారు. వీరిలో 100మందికి పైగా కరోనా బారిన పడ్డారు. నలుగురు చనిపోయారు. వీరిలో పెళ్లి కొడుకు తండ్రి కూడా ఉన్నారు. 
  • నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్దాపూర్ లో పెళ్లికి హాజరైన వారిలో 370 మందికి టెస్టులు చేస్తే 86 మందికి పాజిటివ్ వచ్చింది. 
  • యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని ఓ తండాలో ఎంగేజ్‌మెంట్‌కు అటెండ్ అయినవారిలో 15 మందికి కరోనా సోకింది. ఒక మహిళ చనిపోయింది. 
  • హైదరాబాద్ పాతబస్తీలో పర్ఫ్యూమ్‌  షాప్​ ఓనర్‌ కూతురు, ఐపీఎస్‌ ఆఫీసర్‌ కొడుకు పెండ్లి గ్రాండ్ గా జరిగింది. హోంమంత్రి మహమూద్‌ అలీతోపాటు వీఐపీలు హాజరయ్యారు. కరోనా రూల్స్‌ పాటించకుండా జరిపిన ఈ పెళ్లి వివాదాస్పమైంది.