జీహెచ్ఎంసీ ఆఫీసులోకి మీడియా నో ఎంట్రీ.. బోగస్ విలేకర్లపై నియంత్రణ కోసమే!

జీహెచ్ఎంసీ ఆఫీసులోకి మీడియా నో ఎంట్రీ.. బోగస్ విలేకర్లపై నియంత్రణ కోసమే!
  • స్టాండింగ్ కమిటీలో చర్చపై మేయర్ విజయలక్ష్మి స్పష్టత 
  • గుర్తింపు పొందిన మీడియాకు అడ్డంకులుండవని ప్రకటన  

హైదరాబాద్​సిటీ, వెలుగు: ప్రభుత్వ గుర్తింపు కార్డులు లేకుండా బల్దియా ఆఫీసుల్లోకి వచ్చి వేధిస్తున్న బోగస్ మీడియాపై మాత్రమే ఆంక్షలు విధించబోతున్నట్టు మేయర్​గద్వాల్​ విజయలక్ష్మి ప్రకటించారు. మీడియా ముసుగులో కొంత మంది బోగస్ విలేకర్లు బల్దియా అధికారులను బ్లాక్​మెయిల్​చేస్తూ డబ్బులు దండుకుంటున్నారని, వారి నుంచి కాపాడాలని స్టాండింగ్ కమిటీ సమావేశంలో అన్ని పార్టీల సభ్యులు కోరారన్నారు. త్వరలో జోనల్, సర్కిల్, హెడ్డాఫీసులోకి రాకుండా తీర్మానం చేస్తామన్నారు. నకిలీ విలేకరుల సమస్య నగరమంతా ఉందని, ఈ అంశంపై ప్రజా ప్రతినిధులకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. 

జీహెచ్ఎంసీ ఆఫీసుల్లోనూ తిష్టవేస్తూ సమస్యలు సృష్టిస్తున్నారని కంప్లయింట్స్​ఉన్నాయన్నారు. గుర్తింపు పొందిన మీడియా సంస్థలు, మీడియా ప్రతినిధులకు అడ్డంకులు కల్పించాలన్నది స్టాండింగ్ కమిటీ ఉద్దేశం కాదన్నారు. మీడియా స్వేచ్ఛకు బల్దియా ఎప్పుడూ భంగం కలిగించదన్నారు. అయితే, అధికారుల డ్యూటీలకు ఇబ్బందులు కలగకుండా నిర్ణీత టైంలో కలుసుకునేలా పీఆర్​వో వ్యవస్థను సర్కిల్/జోనల్ ఆఫీసుల్లో ఏర్పాటు చేస్తామన్నారు. 

వారి ద్వారా సమాచారం ఇవ్వాలనేది స్టాండింగ్ కమిటీ సభ్యుల ఉద్దేశ్యమన్నారు. అయితే, బల్దియాలో మీడియా ప్రతినిధుల ప్రవేశంపై నిషేధం విధించే యోచనలో ఉన్నట్టు తెలిసిందని, దాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ మీడియా ఇన్​చార్జి, మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ ఊరపల్లి అన్నారు.