టెహ్రాన్: యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తుతుందన్న ఆందోళనల వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. హార్ముజ్ జలసంధిని అమెరికా, ఇజ్రాయెల్, యూరప్, ఆయా దేశాల మిత్రదేశాలకు చెందిన నౌకలకు మాత్రమే మూసివేస్తున్నట్లు గురువారం స్పష్టం చేసింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం.. యుద్ధ సమయంలో హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలను నియంత్రించే హక్కు తమకు ఉందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్జీసీ) తెలిపింది.
అమెరికా, ఇజ్రాయెల్, యూరప్ దేశాల నౌకలు హార్మూజ్ జలసంధిలో కనిపిస్తే కచ్చితంగా వాటిపై దాడులు చేస్తామని హెచ్చరించింది. గత శనివారం అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభమైనప్పటి నుంచి హార్ముజ్ జలసంధిని ఇరాన్ క్లోజ్ చేసింది.
దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడమే కాకుండా సప్లయ్ సిస్టమ్‌పై తీవ్ర ప్రభావం పడింది. అయితే, చైనా నౌకలకు మాత్రం జలసంధి గుండా ప్రయాణించడానికి ఇరాన్ అనుమతించింది. ప్రపంచవ్యాప్తంగా సముద్రం ద్వారా రవాణా అయ్యే చమురులో ఐదో వంతు హార్ముజ్ జలసంధి నుంచే వెళ్తుంది. ఈ మార్గం దుబాయ్‌లోని జెబెల్ అలీ పోర్ట్ వంటి ప్రధాన వాణిజ్య కేంద్రాలకు ఏకైక దారి కావడం వల్ల దీని ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది.
ఇజ్రాయెల్‌కు వారానికి 25 వేల కోట్లు నష్టం
జెరూసలెం: ఇరాన్‌తో యుద్ధం కారణంగా తమకు వారానికి 3 బిలియన్ (రూ.25 వేల కోట్లు) డాలర్ల నష్టం వాటిల్లుతున్నదని ఇజ్రాయెల్ ఆర్థిక శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న 'రెడ్ లెవల్' ఆంక్షలను' ఆరెంజ్ లెవల్(పరిమిత కార్యకలాపాలు)' కు మార్చాలని ఇజ్రాయెల్ రక్షణ దళమైన హోమ్ ఫ్రంట్ కమాండ్ చీఫ్ మేజర్ జనరల్ షాయ్ క్లాపర్‌ను.. ఆ దేశ ఆర్థిక శాఖ డైరెక్టర్ జనరల్ ఇలాన్ రోమ్ లెటర్ ద్వారా కోరారు. ‘‘ రెండేండ్లుగా భద్రతా అవసరాల పెరుగుదల, యుద్ధాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ భారీ మూల్యాన్ని చెల్లిస్తోంది.
ఈ నేపథ్యంలో దేశ భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుంటూనే ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాపారాలు, వర్క్ ప్లేస్ లను క్రమంగా పునఃప్రారంభించేలా ఆంక్షలను సడలించండి. ప్రస్తుత రెడ్ లెవల్ ఆంక్షలను ఆరెంజ్ లెవల్‌గా మార్చండి. దీనివల్ల దేశ భద్రతను కాపాడుతూనే ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడానికి వీలవుతుంది. యుద్ధంతో వారానికి జరిగే ఆర్థిక నష్టాన్ని 3 బిలియన్ డాలర్ల నుంచి 1.5 బిలియన్ డాలర్లకు తగ్గించవచ్చు’’ ఇలాన్ రోమ్ తన లేఖలో పేర్కొన్నారు.
